Warts | చర్మంపై కనిపించే చిన్న గుండ్రని లేదా అండాకార పెరుగుదలలను పులిపిర్లు (వార్ట్స్) అంటారు. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే సాధారణ చర్మ సమస్య. సాధారణంగా నొప్పి ఉండకపోయినా, కొన్ని సందర్భాల్లో అసౌకర్యం లేదా నొప్పిని కలిగిస్తాయి. చేతులు, కాళ్లు, జననేంద్రియాలపై కూడా ఇవి కనిపించే అవకాశం ఉంటుంది. వైద్యులు అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స లేదా క్రయోథెరపీ వంటి చికిత్సలను సూచిస్తారు. అయితే ప్రారంభ దశలో కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించడం వల్ల కొంతమందికి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలోవెరా (కలబంద) జెల్‌ను నేరుగా పులిపిర్లపై రాయడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంటున్నారు. కలబందలో ఉండే మాలిక్ యాసిడ్ చర్మాన్ని పునరుద్ధరించడంలో, వార్ట్‌లను క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
బేకింగ్ పౌడర్‌ను ఆముదం నూనెతో కలిపి పేస్ట్‌లా తయారు చేసి రాత్రి సమయంలో వార్ట్లపై రాసి, బ్యాండేజ్‌తో కప్పాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల వార్ట్ లు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్ వార్ట్ ల కణజాలాన్ని క్రమంగా దెబ్బతీయడంలో సహాయపడుతుంది. కాటన్‌ను వెనిగర్‌లో ముంచి వార్ట్లపై ఉంచి, అతికే బ్యాండేజ్‌తో రాత్రంతా అలాగే ఉంచాలి. అరటి తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మాన్ని పునరుత్తేజపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు అరటి తొక్క లోపలి భాగంతో వార్ట్లపై నెమ్మదిగా రుద్దడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లపై ప్రభావం చూపుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి వార్ట్లపై రాయడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గడంలో సహాయపడతాయి. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పసుపును కొద్దిగా నీటితో కలిపి పేస్ట్‌లా చేసి వార్ట్లపై రాసి సుమారు అరగంట తర్వాత కడిగేయాలి. పసుపులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో, వార్ట్‌లను తొలగించడంలో సహాయపడతాయి. పసుపు వల్ల చర్మంపై ఏర్పడే పసుపు రంగును నిమ్మకాయ ముక్కతో నెమ్మదిగా రుద్ది తొలగించవచ్చు. లవంగ నూనెను వార్ట్లపై రాసి బ్యాండ్ ఎయిడ్‌తో కప్పాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల వార్ట్ లు తగ్గే అవకాశం ఉంటుంది. లవంగ నూనెలో ఉండే యూజెనిన్ అనే సమ్మేళనం యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉండి వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. అయితే వార్ట్స్ పరిమాణం పెరగడం, నొప్పి, రక్తస్రావం లేదా జననేంద్రియాలపై కనిపించడం వంటి పరిస్థితుల్లో ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం అవసరం.