.. ఇది ఎలిగేడు మండలం ముప్పిరితోట-సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామాలకు వేసిన బీటీ రోడ్డు ఇది. ఐదు నెలల క్రితమే రూ.1.25 కోట్ల వ్యయంతో 4.27 కిలో మీటర్ల దూరం వరకు నిర్మించగా, కుదురుపాక ఎల్లమ్మ చెరువు నుంచి ఓవర్‌లోడ్‌తో లారీలు, టిప్పర్లు వెళ్తుండడంతో ఇలా పూర్తిగా దెబ్బతిన్నది. దీనిపై గ్రామస్తులు ఇటీవల ఆందోళనకు దిగడంతోపాటు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
.. ఎక్స్‌కవేటర్‌తో మట్టిని తోడి లారీల్లో నింపుతూ కనిపిస్తున్న చిత్రం సుల్తానాబాద్ మండలం కొదురుపాక ఎల్లమ్మ చెరువులోనిది. అయితే, ఇరిగేషన్ అధికారులు ఈ చెరువులో కేవలం మూడు ఫీట్ల లోతు వరకు మాత్రమే తీయాలని అనుమతులు ఇచ్చారు. కానీ, ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఆరు ఫీట్ల వరకు మట్టిని తోడారు. ఇంత దర్జాగా తీస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనలకు పాతరేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.

పెద్దపల్లి, జూన్ 3(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా ఇటుక బట్టీలు విస్తరించి ఉండడంతో మట్టికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఇదే అదునుగా ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మట్టి మాఫియా చెలరేగిపోతున్నది. చెరువులను చెరబట్టి, మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నది. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తున్న అక్రమార్కులు, ఏటా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్టు తెలుస్తున్నది. వీరికి అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తూ.. అనుమతులు ఇప్పిస్తూ ఎక్కడా ఎలాంటి అవాంతరాలు రాకుండా తామే చూసుకుంటామని మధ్యవర్తిత్వం నెరుపుతూ అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా చెరువుల్లో మట్టి ఖాళీ అవుతుందే తప్పా ఆ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం లేదు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లోని కొందరు ఇటుక బట్టీల యజమానులు చెరువులపై కన్నేసి, పెద్ద ఎత్తున మట్టి రవాణా చేస్తున్నారు. సుల్తానాబాద్ మండలం కొదురుపాక ఎల్లమ్మ చెరువు నుంచి మట్టి తీతకు అధికారులు అనుమతులు ఇవ్వగా.. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వుతున్నారు.
దాదాపు 10 వరకు ఎక్స్కవేటర్లతో వందలాది లారీలు, టిప్పర్లతో అటు సుల్తానాబాద్, ఇటు పెద్దపల్లి మండలంలోని ఇటుక బట్టీలకు రవాణా చేస్తున్నారు. చెరువులో నుంచి మూడు ఫీట్ల లోతు వరకే తీయాల్సి ఉన్నా.. ఆరు ఫీట్ల లోతు వరకు తోడేస్తున్నారు. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో మట్టి తీత చేయాల్సి ఉన్నా.. కేవలం పంచాయతీ అధికారుల పర్యవేక్షణ మాత్రమే కనిపిస్తున్నది. భారీగా మట్టిని వెలికితీసి ఓవర్‌లోడ్‌తో తరలిస్తుండడంతో కొదురుపాక నుంచి సుల్తానాబాద్ వరకు, అటు కొదురుపాక నుంచి పెద్దపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారులు దెబ్బతింటున్నాయి.
ఈ క్రమంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నా.. మట్టి అక్రమ రవాణాపై చర్యలు కరువయ్యాయి. మంగళవారం పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి గ్రామస్తులు ఆగ్రహించి, టిప్పర్లను అడ్డుకొని రాస్తారోకో చేశారు. టిప్పర్లు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నా.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఇలా ఒక్క నిమ్మపల్లి గ్రామస్తులే కాదు.. మట్టి రవాణాతో ఇబ్బంది పడుతున్న ఎన్నో గ్రామాల ప్రజలు ఇలా ప్రశ్నిస్తున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు.

అనుమతి తక్కువ.. తరలింపు ఎక్కువ
గత నెల 22 నుంచి కుదురుపాక చెరువులో మట్టి తీత ప్రారంభించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలంలోని 41 ఇటుక బట్టీలకు చెందిన యజమానులు ఒక్కొక్కరు 25 లారీల ట్రిప్పుల తరలింపునకు అనుమతులు తీసుకున్నారు. ఆ తర్వాత తిరిగి వారే ఒక్కొక్కరు అదనంగా 100 ట్రిప్పులకు పర్మిషన్ పొందారు. కానీ, అనుమతులకు మించి ఇప్పటికే మట్టిని కొల్లగొట్టగా.. ఇంకా వేలాది ట్రిప్పుల మట్టిని తరలిస్తూనే ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధమైతే చర్యలు తీసుకుంటాం
కొదురుపాక చెరువులో అనుమతుల మేరకు.. పూర్తిగా అధికారుల పర్యవేక్షణలోనే తవ్వకాలు జరుగుతున్నాయి. ఓవర్‌లోడ్ విషయం మా పరిధిలోని అంశం కాదు. మూడు ఫీట్లలోపే పంచాయతీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోనే మట్టి తీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే చర్యలు తీసుకుంటాం. మొత్తం 5200 ట్రిప్పులకు అనుమతులు తీసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 4,500 వరకు తరలించారు. మరో 700 ట్రిప్పుల వరకు మిగిలి ఉండవచ్చు. అక్రమంగా తరలివెళ్లకుండా చూస్తాం.