భోపాల్ : వాగ్దేవిమాత(Goddess Vagdevi, సరస్వతీదేవి) విగ్రహాన్ని లండన్ నుంచి తీసుకువచ్చేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. దీనికి సంబంధించిన దౌత్యపరమైన చర్యలు మొదలైనట్లు కేంద్రం వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని భోజశాలలో వాగ్దేవి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రస్తుతం వాగ్దేవి విగ్రహం లండన్‌లోని మ్యూజియంలో ఉన్నట్లు కేంద్ర సంస్కృతిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. భోజ్‌శాల-కమల్ మౌలా మసీదుపై హిందువులు, ముస్లింల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే గతంలో భోజ్శాలో సరస్వతీ దేవి గుడిగా వర్ధిల్లేదని, ఇక్కడ హిందువులు పూజలు చేసేందుకు అర్హులని ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ శుక్రవారం మాత్రం వివాదాస్పద భోజ్‌శాల ఆవరణలో ముస్లింలు ప్రార్థనలు చేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది.
కోర్టులో పిటీషన్ వేసిన హిందువులు.. వాగ్దేవి మాత విగ్రహన్ని లండన్ మ్యూజియం నుంచి తీసుకురావాలని కూడా కోరారు. సరస్వతీ దేవి విగ్రహం .. కోహినూర్ డైమండ్ కన్నా ముఖ్యమైందన్నారు. మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ కార్యదర్శి షియో శేఖర్ శుక్లా కేంద్రానికి లేఖ రాశారని, లండన్ మ్యూజియంలో ఉన్న వాగ్దేవి విగ్రహన్ని తీసుకురావాలని కోరారని కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ తెలిపారు. అయితే బ్రిటన్, భారత్ మధ్య జరిగే దౌత్యపరమైన చర్చల ఆధారంగా ఆ విగ్రహన్ని తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. లండన్ మ్యూజియంలో ఉన్న విగ్రహం.. ధార్ నుంచి తీసుకెళ్లినదే అని ఆయన అన్నారు.