Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 5: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం, ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో పర్యటించేందుకు అనుమతించింది. ఇందుకోసం కోర్టు కస్టడీలో ఉన్న ఆయన పాస్‌పోర్టులను తాత్కాలికంగా విడుదల చేయాలని ఆదేశించింది.
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో విదేశీ పర్యటన చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పాస్‌పోర్టులను తాత్కాలిక కస్టడీకి ఇవ్వడంతో పాటు విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పిటిషన్‌ను పాక్షికంగా అనుమతించింది.
విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూనే కోర్టు పలు షరతులు విధించింది. రూ.1 లక్ష వ్యక్తిగత బాండ్‌తో పాటు ఒక ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి ప్రయాణ వివరాలు, అక్కడ బస చేసే చిరునామాలు, సంప్రదింపు ఫోన్ నంబర్లు కోర్టుకు అందజేయాలని పేర్కొంది.
అలాగే, సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్టులను తిరిగి కోర్టులో జమ చేస్తానని అఫిడవిట్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఆ అఫిడవిట్ సమర్పించిన అనంతరం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి లేఖ రాసి పాస్‌పోర్టులను తాత్కాలికంగా అప్పగించాలని కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.