ఖమ్మం రూరల్, సెప్టెంబరు 26 : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు ఉపాధ్యాయుడి కీచక చేష్టలపై ప్రధానోపాధ్యాయుడికి విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమళ్ల ఉన్నత పాఠశాలలో ఎండీ షఫీ కహమద్ ఫిజికల్ డైరెక్టర్గా కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొద్దిరోజులుగా సీనియర్ విద్యార్థినులతో అతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీనిపై విద్యార్థినులు మూడు రోజుల క్రితం ప్రధానోపాధ్యాయుడు నందులాల్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు.
అయితే విద్యార్థినులు ఫిర్యాదు చేసిన అనంతరం సదరు ఉపాధ్యాయుడు రెండు రోజులుగా సెలవులో ఉండటంతో తల్లిదండ్రులకు అనుమానం మరింత పెరిగింది. దీంతో శనివారం పలువురు తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల విషయంలో ఎలాంటి జోక్యాలు లేకుండా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Gudimalla Hgih School1
ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కొందరు వ్యక్తులు ఇంటింటికీ వెళ్లి తమను ప్రశ్నిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థినులు తమతో జరిగిన విషయాలను స్వేచ్ఛగా చెప్పిన తర్వాత వారిపై ఒత్తిడి తీసుకురావడం సరికాదని అన్నారు. విద్యార్థుల వ్యవహారంలో రాజకీయ నాయకుల జోక్యం ఎందుకని ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని డిమాండ్ చేశారు.
విద్యార్థినులు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేసిన విషయాన్ని ధ్రువీకరించిన ప్రధానోపాధ్యాయుడు నందులాల్.. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.