ఆదిలాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ) : మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ‘నమస్తే’తో ఆదిలాబాద్ సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ తెలిపారు. సుమన్ కేసులో ఈ రోజు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి పోలీసులు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వం సుమన్‌పై కక్ష కట్టినట్లు స్పష్టమవుతుందన్నారు. కోర్టులో పీపీ ఉండగా ఆయనను పక్కన పెట్టి మరో పీపీ నియమించడం విషయంలో ప్రభుత్వం అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు జైలు అధికారులు సుమన్‌ను వేధింపులకు గురి చేస్తున్నారని, నిత్యావసరాలు ఇవ్వకపోవడంతోపాటు ఒంటరిగా ఉండాలని సూచిస్తున్నారని తెలిపారు. ఈ రోజు కస్టడీ పిటీషన్లో భాగంగా గౌరవ న్యాయస్థానానికి ప్రభుత్వ న్యాయవాది కస్టడీ ఎందుకు అనే విషయాన్ని వివరించలేకపోయారన్నారు. పోలీసులు మంత్రి వివేక్ ఆదేశానుసారం బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారని, మాజీ ఎంపీ బాల్క సుమన్ ఇంటిని చట్టబద్ధత ప్రకారం తనిఖీలు చేయాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించారని తెలిపారు.