హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖలోని కొంతమంది అధికారులు తమపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. గతంలో సర్కార్ మెమోలు జారీ చేసినా, లెక్కచేయకుండా మళ్లీ యథేచ్ఛగా వసూళ్లకు తెగబడుతున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ (డీహెచ్)లో ఓ కీలకాధికారి ఇద్దరు అధికారులను షాడోలుగా నియమించుకొని వసూళ్ల దందా సాగిస్తున్నట్టు తెలిసింది. షాడోలను వసూళ్ల దందాకు పురమాయించి రూ.కోట్లు దండుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. గతంలో ఈ విభాగంలో సదరు కీలకాధికారి సహా ఏడుగురికి సర్కార్ మెమోలు జారీ చేసింది. ఈ అవినీతి బాగోతంపై విచారణ జరిపేందుకు అదే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని ప్రభుత్వం నియమించింది. కానీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో మళ్లీ యథేచ్ఛగా వసూళ్లకు తెగబడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఏవోగా ప్రమోషన్ పొంది తిరిగి డిప్యుటేషన్‌పై డీహెచ్‌లో కొనసాగుతున్న ఓ అధికారి, మరో అడిషనల్ డైరెక్టర్ కలిసి ఈ అవినీతి తంతును సదరు కీలకాధికారి ఆదేశాల మేరకు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ప్రతినెలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోల నుంచి డబ్బులు వసూలు చేసి కీలకాధికారికి ముట్టజెబుతున్నట్టు సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఒక రేటు, ఇతర జిల్లాలకు మరో రేటు ఫిక్స్ చేసి డబ్బులు అందినకాడికి దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) పరిధిలో ఉద్యోగులపై ఏవైనా కారణాలతో విజిలెన్స్ మెమోలు జారీ అయితే, వాటిని క్లియర్ చేసేందుకు సైతం ఈ ఇద్దరు షాడోలు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. విజిలెన్స్ మెమోలు ఉంటే భవిష్యత్తులో ఉద్యోగానికి ఇబ్బందులు తప్పవని పలువురిని భయపెట్టి ఈ దందాకు పాల్పడుతున్నట్టు తెలిసింది. అధికారుల బెదిరింపులతో మెమోలు ఉన్న ఉద్యోగులు వారు అడిగినంత ముట్టజెబుతూ తమ ఫైళ్లను క్లియర్ చేయించుకొంటున్నారని సమాచారం. తమ అక్రమాల దందాకు ఓ మంత్రి పేరును సదరు కీలకాధికారి, ఇద్దరు షాడోలు యథేచ్ఛగా వాడుకొంటున్నట్టు వినికిడి. వైద్యారోగ్య శాఖకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్న సదరు కీలకాధికారి, ఇద్దరు షాడోలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సొంత శాఖ సిబ్బందే ప్రశ్నిస్తున్నారు. సదరు కీలకాధికారి వచ్చే ఏడాది జనవరి 31తో ప్రమోషన్ పొందనుండగా.. ఇదే అదనుగా తమ అవినీతి దందా పెచ్చుమీరినట్టు సమాచారం. ఇప్పటికే రెండు చార్జ్ మెమోలు ఉన్న సదరు కీలకాధికారిని కొనసాగించడం వెనుక ఎవరి హస్తం ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటే ప్రజారోగ్యాన్ని విస్మరించి వసూళ్లపైనే సదరు కీలకాధికారి దృష్టి సారించారని ఆరోపణలున్నాయి.
ఇక సదరు కీలకాధికారి, షాడోలుగా వ్యవహరిస్తున్న వారిలో ఒకరు గతంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) ప్రమోషన్లలో సైతం చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలున్నాయి. ఇటీవల మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలో 92 మందికి ఏవోలుగా ప్రమోషన్లు కల్పించగా, అనర్హులకు పోస్టులు కట్టబెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు కొల్లగొట్టారనే గుసగుసలు వినిపించాయి. ఉద్యోగోన్నతులు కల్పించిన వారి నుంచి ఒక్కో పోస్టుకు రూ.2లక్షల చొప్పున కోట్లలో వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. వసూళ్ల పర్వాన్ని షాడోగా వ్యవహరించిన వ్యక్తితోపాటు అడిషనల్ డైరెక్టర్, సదరు కీలకాధికారి వాటాలు వేసుకొని పంచుకొన్నారని నాడు ప్రిన్సిపల్ సెక్రటరీకి కొంతమంది ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అయినా సదరు కీలకాధికారి, షాడో అధికారి, అడిషనల్ డైరెక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనక మతలబు ఏంది? అని పలువురు సొంత శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నా, అధికారులపై చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నదెవరో తేలాల్సి ఉన్నది.
సదరు కీలకాధికారికి షాడోగా వ్యవహరిస్తున్న ఇద్దరిలో ఓ ఉద్యోగికి ఇటీవల నాగర్‌కర్నూల్‌లో ఏవోగా ప్రమోషన్ వచ్చింది. అయితే, సదరు ఉద్యోగి అక్కడ రిపోర్టు సైతం చేసి వచ్చారు. కానీ, వసూళ్ల దందా మొత్తం చక్కదిద్దే ఆయన లేకపోతే తనకు ఇబ్బందులు తప్పవని భావించిన కీలకాధికారి పట్టుబట్టి మరీ సదరు ఉద్యోగిని తిరిగి తెచ్చుకొన్నారు. ఆ అధికారిని డీహెచ్ కార్యాలయంలో ప్లానింగ్ సెక్షన్లో డిప్యుటేషన్‌పై కొనసాగిస్తున్నారు. పైకి ఏవో ప్రమోషన్ల అక్రమాల తర్వాత సదరు అధికారిని పక్కన పెట్టామని కీలకాధికారి చెప్తున్నా.. పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కీలకాధికారి సదరు ఉద్యోగిని కావాలనే ప్లానింగ్ సెక్షన్లో ఉంచి మళ్లీ తమ వసూళ్ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యుటేషన్‌పై సదరు ఉద్యోగిని మళ్లీ డీహెచ్‌లో కొనసాగించడంపై సొంత శాఖ సిబ్బంది సైతం పెదవి విరుస్తున్నారు. ఆ అధికారి కంటే సమర్థులు డీహెచ్‌లో లేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక సదరు అధికారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ విభాగంలో కీలకాధికారి షాడోగా రాజ్యమేలుతున్నారని వైద్యశాఖ వర్గాలే చెప్తుండటం గమనార్హం. ఇప్పటికైనా సదరు కీలకాధికారి, అతనికి షాడోలుగా వ్యవహరిస్తున్న ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.