Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సహా దక్షిణాది సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది.
1931 సెప్టెంబరు 21న ఏపీలోని అప్పటి నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ చదివారు. కాలేజీ రోజుల్లోనే హలీవుడ్ చిత్రాలపై మక్కువ పెంచుకున్న ఆయన.. ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘మాయాబజార్’, ‘జగదేకవీరుని కథ’ వంటి చిత్రాలకు పనిచేశారు. 1972లో ‘నీతి నిజాయితీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.
తన సుదీర్ఘ కెరీర్లో సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో 60కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మయూరి’, ‘పుష్పక విమానం’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘మేడమ్’, ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ముఖ్యంగా ‘పుష్పక విమానం’లో సంభాషణలు లేకుండా కథను నడిపించడం, ‘ఆదిత్య 369’లో టైమ్ ట్రావెల్ అంశాన్ని చూపించడం ఆయన ప్రయోగాత్మక దృక్పథానికి నిదర్శనాలుగా నిలిచాయి. 94 ఏళ్ల వయసులోనూ సినిమా పట్ల తన అభిరుచిని కొనసాగించిన సింగీతం.. 2026లో ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం జూన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే ఆయన దర్శకత్వం వహించిన సినిమా కావడం గమనార్హం. ఆయన కెరీర్లో రెండు జాతీయ పురస్కారాలు, ఐదు నంది అవార్డులు, పలు ఫిల్మ్వేర్ అవార్డులను ఆయన అందుకున్నారు.