హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఆగస్టు 5 వరకు సగటు సాధారణ వర్షపాతం 396.3 మి.మీ పడాల్సి ఉండగా, 377.0 మి.మీ కురిసిందని అధికారులు పేర్కొన్నారు. 9 జిల్లాల పరిధిలోని 222 మండలాల్లో లోటు వర్షపాతం, 8 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం ఉన్నట్టు తెలిపారు. భద్రాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, ఖ మ్మం, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో -23 నుంచి -48 శాతం లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు వెల్లడించారు. గత 24 గంటల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లెలో అత్యధికంగా 4.76 సెం.మీ వర్షపాతం నమోదైందని చెప్పారు.