Vishwanath & Sons | కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఇటీవల విడుదలైన సూర్య ఫ్యామిలీ డ్రామా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమాలోని బలమైన కథాంశం తనను ఎంతగానో కదిలించిందని, రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేసిందని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా చూసిన తర్వాత దాదాపు ఒక గంట పాటు మంచంపై అలాగే పడుకుని ఉండిపోయానని, ఆ ఎమోషన్స్ నుండి తాను బయటకు రాలేకపోయానని శివరాజ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కథ తన తల్లిదండ్రులు దివంగత లెజెండరీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్, పార్వతమ్మ రాజ్‌కుమార్ లతో పాటు తన కుటుంబాన్ని గుర్తుకు తెచ్చిందని, తనలో ఎన్నో జ్ఞాపకాలను మేల్కొలిపిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. కొన్ని రకాల భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేమని చెబుతూ, భవిష్యత్తులో తాను కూడా ఇంతటి లోతైన భావోద్వేగాలు ఉన్న సినిమాకు దర్శకత్వం లేదా నిర్మాణం వహించాలని కోరుకుంటున్నట్లు ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు.
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా కుటుంబ కథా చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో మధ్య వయస్కుడైన బిజినెస్ టైకూన్, మాజీ ఒలింపిక్ పిస్తోల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ పాత్రలో హీరో సూర్య నటించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించుకుని బతికే ఒక వ్యక్తి, జీవితంలోని మధ్య వయస్సు సవాళ్లు, కుటుంబ బాధ్యతలు మరియు ఒక యువతితో ఏర్పడే వినూత్నమైన ప్రేమకథ కారణంగా అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
#Shivarajkumar: I watched #VishwanathAndSons recently. When I saw the film, I couldn’t sleep for an hour. It reminded me of my parents and my family. I was lying there, thinking about it, and I was in tears. I think some emotions.. I also wish to do a film like that someday.…
— Laxmi Kanth (@iammoviebuff007) September 26, 2026