హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం సైన్స్, శ్రమ, అంకితభావంతోనే సాధ్యమైందని జియోటెక్నికల్ ఇంజినీరింగ్ నిపుణురాలు, ఐఐఎస్సీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ జీ మాధవీలత అన్నారు. ‘బ్రిడ్జింగ్ ది డిఫికల్ట్ టెరైన్స్’ అనే అంశంపై హైదరాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరిగిన 83వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చినాబ్ రైల్వే బ్రిడ్జి కేవలం ఒక వంతెన మాత్రమే కాదని, భారత్ సాధించిన అసమానమైన ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడారు. హిమాలయాల్లోని కఠినమైన భౌగోళిక పరిస్థితులు, తీవ్రమైన వాతావరణంతో ఎదురయ్యే సవాళ్లను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించామని చెప్పారు. ఈ అద్భుత ప్రాజెక్టుకు మాధవీలత దాదాపు 17 ఏండ్లపాటు జియోటెక్నికల్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. కొండచరియల స్థిరీకరణ, పునాదుల రూపకల్పన, రాక్ ఇంజినీరింగ్ వంటి అంశాల్లో కీలకమైన సలహాలు అందించారు.
సీఎస్ఐఆర్-ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోని యెదుగుండ్లపాడు అనే చిన్న గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, నిట్ వరంగల్, ఐఐటీ మద్రాస్‌లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన మాధవీలత అంతర్జాతీయస్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.