తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే మరోవైపు సాక్షాత్తూ రాజధానిలో అప్రకటిత కరెంట్ కోతలతో జనం తల్లడిల్లుతున్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియక అన్నిరంగాల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే కరెంట్ కోతలపై నెటిజన్లు ఎక్స్ వేదికగా మండిపడుతూ పోస్టులు పెడుతుఉన్నారు. తమకు కరెంట్ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ టీజీఎస్పీడీసీఎల్పై మండిపడుతున్నారు. పరీక్షల సమయంలో కరెంట్ పోవడం, వర్క్ ఫ్రం హోమ్ టైమ్‌లో పవర్ కట్‌తో ఏం చేయాలో తోచక కరెంట్ ఆఫీసుకు ఫోన్ చేసినా ఫలితం ఉండడం లేదని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు చెప్పారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ)
జనవరి చివరి వారంనుంచే అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ పరీక్షలు మొదలవుతుండగా, పదో తరగతి పరీక్షలు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. విద్యార్థుల ప్రిపరేషన్ సమయంలో కరెంట్ అడపాదడపా పోతుండడంతో వారి బాధలు వర్ణణాతీతం. అంతేకాకుండా ఎండాకాలంలోనే అకడమిక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షలు కూడా ఉండడంతో తమ ప్రిపరేషన్ ఎలా సాగుతుందోనంటూ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే కరెంట్ కోతలపై వినియోగదారులు తమ ప్రాంతాలకు కేటాయించిన ఫోన్నెంబరకలకు ఎనుఎన్నిసార్లు కాల్ చేసినా వారి నుంచి స్పందన లేదని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా ఆయా ఏరియాల కరెంట్ ఆఫీసులకు ఫోన్‌చేస్తే వారు ఎత్తినా కరెంట్ ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటున్నారని కొందరు వినియోగదారులు చెప్పారు. కొన్నిచోట్ల మెయింటెనెన్స్ కోసం ప్రకటించిన కోతలకు సంబంధించిన వాటిపై కూడా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులు పరీక్షల సమయంలో ఎలా చదువు సాగుతుందోనంటూ భయపడుతున్నారు. దక్షిణ డిస్కం పరిధిలో కరెంట్ కోతలు లేకుండా చూస్తామంటూ గొప్పలు చెప్పిన యాజమాన్యం ఈ కరెంట్ కోతలపై ఆధారాలతో సహా పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ నగరవాసులు ఆరోపిస్తున్నారు.
నెటిజన్ల ఆగ్రహం..
కరెంట్ కోతలతో వర్క్ ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాము కాల్స్‌లో ఉన్న సమయంలో ఒక్కసారిగా కరెంట్ పోయి రావడంతో నెట్ కనెక్ట్ కావడం లేదని, దాంతో తమ టీమ్ లీడర్లతో సమస్యలు వస్తున్నాయంటూ కరెంట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయింటెనెన్స్ అంటూ ప్రకటించిన సమయాల్లో కాకుండా రాత్రి వేళల్లో, సాయంత్రం సమయాల్లో కరెంట్ పోవడంపై నెటిజన్లు ఎక్స్ వేదికగా సాక్ష్యాధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు. దీంతో వారిపై టీజీఎస్పీడీసీఎల్ కౌంటర్ ఇస్తూ ఇవన్నీ ఫేక్ అని చెప్తూ పోస్టులు పెట్టడంతో ఫైరయిన నెటిజన్లు టీడీపీ మహిళా అధ్యక్షురాలు డా.తిరునగరి జ్యోత్స్నా పెట్టిన పోస్టును ఉదహరిస్తూ ఇది కూడా ఫేక్ అని చెప్తారా అంటూ ప్రశ్నించారు. రంగారెడ్డి, మేడ్చల్, మెట్రో జోన్ల పరిధిలోని పది సర్కిళ్లు, డివిజన్లలో ఈ పరిస్థితి ఉందని, ప్రత్యేకించి అధిక డిమాండ్ ఉన్న సైబర్‌సిటీ, మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్లలో కోతలు లేకుండా డిమాండ్‌కు తగ్గట్లుగా సైప్లె అందించడంలో టీజీఎస్పీడీసీఎల్ విఫలమయిందని నెటిజన్లు మండిపడుతున్నారు.

Tweet