రోజంతా వ్యవసాయ పనులతో తలమునకలవుతున్న రైతన్న యూరియా కోసం పడుతున్న బాధలు వర్ణణాతీతం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు యూరియా బుకింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. కనీస అవగాహనలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. స్మార్ట్ఫోన్లు లేని రైతులే 90 శాతం ఉన్నారు. వీరందరికీ యూరియా తీసుకోవడం కష్టతరంగా మారింది. ఫర్టిలైజర్ యాప్ తీసుకొచ్చి చేతులు దులుపుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పించటంలో విఫలమయ్యాయి.
యూరియా వచ్చినంత సేపులోనే స్టాక్ అయిపోయిందన్న సమాచారంతో దిక్కుతోచని స్థితితో సన్నకారు రైతులు ఆగమవుతున్నారు. సరిపడా యూరియా అందించలేకపోవడంతో పంటలు ఎదుగుదల లేక మదనపడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 1.85 లక్షల మంది రైతులు ఉండగా వీరిలో చిన్న, సన్నకారు రైతులు లక్షకు పైగానే ఉన్నారు. వీరందరికీ స్మార్ట్ఫోన్లు లేక బుకింగ్ ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీ వద్దకు వెళ్లి అధికారులతో బుకింగ్ చేయించుకుంటున్నారు. దీనివల్ల సమయం ఎక్కువ వృథా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– అశ్వారావుపేట, ఫిబ్రవరి 23
రైతు ప్రయోజనం కోసమని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కొత్త కష్టాల్లోకి నెట్టివేసింది. రోజూవారీ వ్యవసాయ పనులతో సతమతమవుతున్న చిన్న, సన్నకారు రైతులు యూరియా కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. అక్షర జ్ఞానం ఉన్న రైతులకే ఇబ్బందులు తప్పడం లేదు. ఇక చదువుకోని రైతుల దుస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ తరుణంలో స్టాక్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
గతంలో ఒకటో, రెండో బస్తాలు దుకాణాల వద్దకు వెళ్తే అందేవి. కానీ ఇప్పుడు యాప్‌తో యూరియా అందక ఆందోళనకు గురవుతున్నారు. యూరియా కోటా విడుదల సమాచారం కొందరు రైతులకే అందడంతో సామాన్య రైతులు నష్టపోతున్నారు. గతంలో యూరియా కేటాయింపులపై సొసైటీ సిబ్బంది వాట్సప్‌ల ద్వారా సమాచారం అందించేవారు. కానీ కొద్దినెలలుగా ఆ సమాచారం కూడా ఇవ్వడం లేదు. దీంతో యూరియా సమాచారం కోసం కోటా విడుదల కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. పంటలకు సకాలంలో యూరియా అందించకపోవడంతో ఎదుగుదల లేక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ మనోవేదన చెందుతున్నారు.

‘ఫెర్టిలైజర్ యాప్’ కష్టాలు..
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై కనీస అవగాహన లేదు. ఎక్కువమంది రైతులకు స్మార్ట్ఫోన్లు లేవు. చిన్న, సన్నకారు రైతుల్లో 90 శాతం మంది రైతులకు కీప్యాడ్ ఫోన్లే ఉన్నాయి. వాటిలో యూరియా బుకింగ్ చేయలేరు. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కచ్చితంగా రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండాలి. ఒకవేళ స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పటికీ పల్లెల్లో చాలామంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని కొంచెం అవగాహన పెంచుకుని యూరియా కోసం ప్రయత్నిస్తే అప్పటికే ఉన్న నిల్వలు ఇతర రైతులకు వెళ్లిపోవడంతో నో స్టాక్ అని సందేశం దర్శనమిస్తోంది. ఇక కీప్యాడ్ ఫోన్లు ఉన్న రైతులు దిక్కుతోచక సొసైటీ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ సొసైటీ సిబ్బందితో యురియా బుకింగ్ చేసుకుంటున్నారు.
అక్కడ ఓటీపీ ద్వారా యూరియా దక్కించుకుంటున్నారు. దీనికోసం గ్రామాలు దాటి వ్యవసాయ పనులు వదిలేసుకొని పొలాలకు దూరంగా ఉన్న సొసైటీ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా పంటల సాగులో ఎక్కువ సమయం వృథా అవుతోంది. గతంలో దుకాణాల వద్ద ఎన్ని ఇబ్బందులు పడినా ఒకటో.. రెండో బస్తాలు అందేవి. ఇప్పడు యాప్‌లో ఎప్పుడు యూరియా వస్తుందో.. ఇప్పుడు అయిపోతుందో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య యాప్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ పాత పద్ధతిలోనే యూరియా అందించాలని కోరుతున్నారు.
లక్షకుపైగా రైతులకు ఇబ్బందులు..
యాప్‌తో 60 నుంచి 70 శాతం మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సుమారు 1.85 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. వీరిలో చిన్న, సన్నకారు రైతులు అధికారిక లెక్కల ప్రకారం లక్షకు పైగానే ఉన్నారు. వీరందరిలో 80 శాతం మంది కీప్యాడ్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. వీరికి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం యూరియా బుకింగ్ చేసుకోవడంపై అవగాహన లేదు. దీంతో దుకాణాలు, సొసైటీల వద్దకు వెళ్లి యూరియా కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది.
అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో యూరియా కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. యూరియా కొరత నుంచి రైతులను డైవర్ట్ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాప్ పేరుతో కొత్త ఇబ్బందులు తీసుకొచ్చిందంటూ రైతులు మండిపడుతున్నారు. పాత పద్ధతిలోనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పంటలు సాగు చేయడం సాధ్యంకాదంటూ అసహనం వెలిబుచ్చుతున్నారు. యాప్‌ను రద్దు చేసి సరిపడా యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
యూరియా బుకింగ్ ఇబ్బందిగా ఉంది
యూరియా బుకింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు స్మార్ట్‌ఫోన్ లేదు. కీప్యాడ్ ఫోనే వాడుతున్నాను. ఈ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోలేం. దీంతో యూరియా కోసం ఎవరో సాయం తీసుకుని బుకింగ్ చేసుకోవాల్సి వస్తోంది. అదీకూడా బుకింగ్ సమయంలో నో స్టాక్ సమాచారం దర్శనమిస్తోంది. పంటలకు యూరియా అందించకుండా దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
– బానోతు వీరూ, రైతు, టేకులపల్లి
ఫెర్టిలైజ్ యాప్‌ను రద్దు చేయాలి
యూరియా బుకింగ్ చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ పనులను వదులుకొని యూరియా కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎక్కువమంది సామాన్య రైతులకు స్మార్ట్ఫోన్లు లేవు. సామాన్య రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యాప్‌ను రద్దు చేసి దుకాణాల వద్దనే యూరియా పంపిణీ చేయాలి. యూరియా సమస్య పరిష్కరించకుంటే పంటలు సాగు చేయలేము.
-సత్తి నాగేశ్వరరావు, రైతు, చండ్రుగొండ
వలంటీర్ల ద్వారా సేవలు
ఫర్టిలైజర్ యాప్‌తో రైతులకు ఎటువంటి సమస్య లేదు. యాప్‌పై అవగాహన కల్పించడంతోపాటు వలంటీర్ల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నాం. స్మార్ట్ఫోన్లు లేని రైతులకు ఓటీపీ ద్వారా యూరియా బుకింగ్ చేసి అందిస్తున్నాం. సామాన్య రైతులు కూడా బుకింగ్ యాప్‌పై అవగాహన కల్పించుకుంటున్నారు. ఇప్పుడు యూరియా బుకింగ్ చాలా సులభం అయ్యింది. రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
– వేల్పుల బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి, కొత్తగూడెం