ఖమ్మం రూరల్, ఆగస్టు 18 : పక్కా స్కెచ్ తో ముందస్తు ప్రణాళికలో భాగంగానే మారుతి రామారావును అంతమొందించేందుకు కుట్ర చేశారని బీఆర్ఎస్ నేత, హర్షిణి డెవలపర్స్ అధినేత అల్లిక వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మారుతి రామారావు అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం సిపిఐ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం జరిగిందన్నారు. అప్పటికే సిపిఐ నాయకుడు పుచ్చకాయల కమలాకర్ రామారావుకు సుమారు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉన్నందున పదేపదే తన డబ్బులు ఇవ్వాలని కోరాడన్నారు. ఇది మనసులో పెట్టుకుని రామారావుపై బెదిరింపులకు పాల్పడడం జరిగిందన్నారు. తనకు ప్రాణహాని ఉన్నదని గ్రహించిన రామారావు ఈ నెల 14న ఖమ్మం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తన ఆవేదన వెల్లబుచ్చడం జరిగిందన్నారు. కమలాకర్ అనే వ్యక్తి నుండి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడన్నారు.
విషయం తెలుసుకుని కమలాకర్ డబ్బుల విషయం సెటిల్మెంట్ చేసుకుందామని మధ్యవర్తుల ద్వారా సమాచారం సైతం ఇవ్వడం జరిగిందన్నారు. మరుసటి రోజు జండా వందనం ఉన్నందున పోలీస్ కేసు పెట్టలేకపోయాడన్నారు. 16వ తేదీ ఖమ్మం నుండి అదే గ్రామానికి చెందిన బట్టు రామారావు అనే వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్ పై రాత్రి 10 గంటలకు గూడూరు పాడు బయల్దేరాడన్నారు. అయితే అప్పటికే కొందరు సిపిఐ నాయకులు ఇతర గంజాయి బ్యాచ్ తో కలిసి ముఠాలుగా విడిపోయి హత్య చేసేందుకు కుట్ర పన్నారన్నారు. గ్రామ పొలిమేరలోకి వచ్చే సమయంలో ఇద్దరు వ్యక్తులు వేరే బైక్పై వచ్చి రాడ్లతో దాడి చేసే ప్రయత్నం చేయగా మారుతి రామారావు తప్పించుకోగా, కూర్చున్న బట్టు రామారావుకు తీవ్ర గాయాలు కావడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై సోమవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. దశాబ్ద కాలంగా గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉన్నాయని, మరోసారి గ్రామాన్ని వల్లకాడుగా మార్చేందుకు సిపిఐ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు.
రామారావును అంతమందించేందుకుగాను 9 మంది సభ్యులు పథకం ప్రకారం కుట్ర పన్నారని, అదృష్టవశాత్తు బయటపడడం జరిగిందన్నారు. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులపై అత్యాయత్నం కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు. గ్రామంలో బీ ఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూడలేక సిపిఐ నాయకులు అనేక కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారన్నారు. వారి ఆకృత్యాలను గ్రామ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని ఇప్పటికే సరైన గుణపాఠం చెప్పారని, రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. గ్రామంలో గాంజా కేసులలో ఉన్న వారిని ఉసిగొలిపి దాడులకు తెగబడే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి చర్యలకు పుల్ స్టాప్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రామారావు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నందున నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విలేకరుల సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండి అమ్మరాజు, పడగల వెంకటేశ్వర్లు, కుర్రి లింగయ్య, కొర్రి తిరుపతిరావు, పడిగల రాము పాల్గొన్నారు.