బెంగళూరు: ఓటర్ల జాబితా నుంచి ఓటర్లను తొలగించాలని కోరుతూ ‘ఫారం-7’ దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేశారన్న ఆరోపణలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులతో కలిసి ఈసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ‘ఫారం 7’ దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. (DK Shivakumar) గురువారం ముందుగా నిర్ణయించిన మంత్రివర్గ సమావేశాన్ని సీఎం డీకే శివకుమార్ వాయిదా వేశారు. మంత్రులు, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయానికి వెళ్లారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడానికి ‘ఫారం 7’ దరఖాస్తులను పెద్ద సంఖ్యలో దాఖలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ధర్నా చేశారు. ‘ఫారం 7’ దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలని, తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చిన దరఖాస్తుదారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాగా, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు ముగిసే చివరి రోజుల్లో, ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి 24 తేదీల్లో పెద్ద సంఖ్యలో ‘ఫారం 7’ అభ్యంతరాలు దాఖలైనట్లు తనకు సమాచారం అందిందని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బెళగావి నార్త్‌లో సుమారు 3,000, ముడిగెరెలో 6,259, బాబలేశ్వర్లో 1,373, నరసింహరాజాలో 1,200, భాల్కి నియోజకవర్గాలలో 2,285 దరఖాస్తులు దాఖలైనట్లుగా నివేదికలు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అర్హులైన ఓటర్ల తొలగింపు కోసం ఆయా వర్గాలను లక్ష్యంగా చేసుకునేందుకు బీజేపీ, జేడీ(ఎస్) కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.
మరోవైపు ‘ఫారం-7’ దుర్వినియోగాన్ని ‘ఎన్నికల మోసం’గా సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. దీనిపై నిష్పాక్షిక, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)
అన్బుకుమార్కు ఒక వినతిపత్రాన్ని ఆయన అందజేశారు. ప్రతి అర్హతగల ఓటరు హక్కులను పరిరక్షించడం, పునఃసమీక్ష ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగేలా చూడటం ముఖ్యమంత్రిగా తన ‘విధి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
స్పందించిన సీఈవో, తప్పుడు ప్రకటనలు లేదా వాంగ్మూలాలు ఇచ్చినట్లు తేలిన దరఖాస్తుదారులపై చర్యలు ప్రారంభించాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సుమారు ఐదు గంటల పాటు సీఈవో కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాను సీఎం డీకే శివకుమార్ ముగించారు.