భారత టీ20 జట్టుకు ఏమైంది? ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసిన తీరుపై అభిమానుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది. అవును సఫారీలతో మ్యాచ్ వరకు ఐసీసీ టోర్నీల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్న భారత్‌ను దక్షిణాఫ్రికా నేలకు దించింది. ఐసీసీ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి తర్వాత ప్రత్యర్థికి తలొగ్గని సూర్యకుమార్ యాదవ్ సేనకే ఏమైంది. లీగ్ దశలో అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ జట్లపై చెమటోడ్చిన గెలిచిన భారత్‌కు టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన సఫారీలు అచ్చిరాని అహ్మదాబాద్‌లో ఓటమి రుచిచూపించారు. గత ప్రపంచకప్ ఫైనల్లో తమ కలలను కప్‌ను దూరం చేసినందుకు కసితీరా ప్రతీకారం తీర్చుకున్నారు.
మెగాటోర్నీలో ఇప్పటి వరకు అపజయమెరుగని దక్షిణాఫ్రికా పన్నిన వ్యూహంలో సూర్యకుమార్‌సేన చేపలా చిక్కుకుంది. బుమ్రా, అర్ష్‌దీప్‌సింగ్ అదిరిపోయే ఆరంభమిచ్చినా సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైన టీమ్ఇండియా మూల్యం చెల్లించుకుంది. ఓవరాల్‌గా టీ20ల్లో పరుగుల పరంగా అత్యంత దారుణమైన ఓటమిని ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. సీనియర్ డేవిడ్ మిల్లర్ ధనాధన్‌కు తోడు యంగ్ తరంగ్ బ్రెవిస్ దూకుడుకు ఆఖర్లో స్టబ్స్ మెరుపులతో పోరాడే స్కోరు అందుకున్న దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో చాకచక్యంగా వ్యవహరించింది. నల్లమట్టితో తయారు చేసిన అహ్మదాబాద్ పిచ్‌ను ముందే అంచనా వేసిన సఫారీ బౌలర్లు స్లో బాల్స్‌తో టీమ్ఇండియా బ్యాటర్లను కంగుతినిపించారు.
మెగాటోర్నీలో కొరకరాని కొయ్యగా ఆఫ్‌స్పిన్ ఆస్త్రంతో ఆదిలోనే దెబ్బతీసిన కెప్టెన్ మార్క్మ్ తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేశాడు. టోర్నీలో అంతోఇంతో ఫామ్‌మీదున్న ఇషాన్‌కిషన్ అనవసర షాట్ ఆడబోయి డకౌట్‌గా వెనుదిరిగితే హ్యాట్రిక్ సున్నాలు చుట్టిన ఓపెనర్ అభిషేక్‌శర్మ ఎట్టకేలకు పరుగుల ఖాతా తెరిచి హమ్మయ్య అనిపించాడు. కానీ ఏం లాభం టీ20ల్లో ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ హోదాను మరిచిపోయిన అభిషేక్..చెత్త షాటి ఆడి జట్టును గెలిపించే అవకాశాన్ని కోల్పోయాడు.
హైదరాబాదీ బ్యాటర్ తిలక్‌వర్మ పేలవ ఫామ్ పీక్‌లో వెళ్లింది. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తిలక్ తన వైఫల్యాలను అధిగమించలేకపోతున్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో జట్టును నిలబెట్టే చాన్స్‌ను చేజేతులా విడిచిపెట్టుకున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ తన సహజశైలికి భిన్నంగా ఆడుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఫినిషర్‌గా జట్టులోకి తీసుకున్న రింకూసింగ్ తన పాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. ఆల్‌రౌండర్‌గా ఆదుకోవాల్సిన హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఎలా ఆడుతాడో తెలియని పరిస్థితి. మొత్తంగా మెగాటోర్నీలో భారత్ ముందంజ వేయాలంటే మిగతా జట్ల గెలుపు, ఓటములపై ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చింది.