ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:03:06

ప్రజావసరాలకే కొత్త సెక్రటేరియట్‌

ప్రజావసరాలకే కొత్త సెక్రటేరియట్‌

  • పాత బిల్డింగ్‌లో అరకొర వసతులు
  • ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివి
  • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజావసరాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, ప్రజలకు పరిపాలనను చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. పాత బిల్డింగ్‌ను సరైన ప్రణాళిక లేకుండా కట్టారని, అరకొర వసతులతో అటు ఉద్యోగులు, ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థం లేనివని చెప్పారు. స్థానిక మీడియా ప్రతినిధులతో మంగళవారం ఆయన మాట్లాడారు. కొత్త సచివాలయ నిర్మాణంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ప్రస్తుతమున్న సెక్రటేరియట్‌ భవనం నిజాం కాలం నాటిదని, పాతవాటినే కూల్చివేసి 50-60 ఏండ్లుగా కొత్తవి కట్టుకుంటూ వస్తున్నారని, అయినా వసతులు సరిగా లేవని వివరించారు.

మంత్రుల కార్యాలయం ఒక చోట, కార్యదర్శులు, ఆఫీసు సిబ్బంది కార్యాలయాలు వేరేచోట ఉండాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. పార్కింగ్‌ సౌకర్యమూ సరిగాలేదని తెలిపారు. సెక్రటేరియట్‌కు వచ్చే ప్రజలు, మరోవైపు ఉద్యోగులు తమ పనుల కోసం బిల్డింగుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లోతుగా అధ్యయనం చేసి, ప్రజావసరాలు తీరేలా కొత్త సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సమగ్రమైన బిల్డింగ్‌కు ప్రణాళికలను రూపొందించారని తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలుచేస్తున్న విమర్శలు అర్థం లేనివని వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ సందర్భంగానూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని, వారికి కాళేశ్వరమే సమాధానం చెప్పిందని తెలిపారు. అదేవిధంగా కొత్త సెక్రటేరియట్‌ భవనం పూర్తయి, అది అందుబాటులోకి వచ్చాక దాని అవసరమేమిటో అప్పుడు ప్రతిపక్షాలకు అర్థమవుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించాలని ఆలోచనలు చేస్తున్నారని, దానికి సెంట్రల్‌ విస్టా అని నామకరణం కూడా చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. logo