కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవికి వ్యతిరేకంగా ఆ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశాయి. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎన్హెచ్ 167 రహదారిపై సోమవారం కాంగ్రెస్ పార్టీ నేతలు, మాదాసి కురువ సంఘం నాయకులు భారీ రాస్తారోకో నిర్వహించారు. పెద్దకొత్తపల్లి కాంగ్రెస్ నాయకుడు దండు నరసింహపట్ల మల్లు రవి అనుచితంగా ప్రవర్తించారని, ఆయన దండు నరసింహకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గో బ్యాక్ మల్లు రవి, మల్లు రవి డౌన్ డౌన్, స్థానికేతర పాలన వద్దు సోదరా అంటూ నినాదాలతో హోరెత్తించారు.
దాంతో జాతీయ రహదారిపై వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి. ప్రయాణికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి దాదాపు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సింగిల్ విండో డైరెక్టర్, మాదాసి కురువ సంఘం జిల్లా నాయకుడు దండు చంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మాధవి భర్త అశోక్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శశిరేఖ భర్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఆది ధర్మేందర్లతోపాటు కాంగ్రెస్ నాయకులు నాగరాజు, ఈశ్వర్, ఎల్లయ్య, సుల్తాన్ తదితరులు క్రియాశీలక పాత్ర పోషించారు.
కాగా, ఈ నెల 2న కొల్లాపూర్ నియోజవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వచ్చారు. ఆ సందర్భంగా కొల్లాపూర్ పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలోని కొల్లాపూర్ నియోజక వర్గంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెప్పారు. ఆ సమయంలో మంత్రి జూపల్లి వర్గీయులు మల్లు రవి ప్రసంగానికి అడ్డుతగిలారు. ప్రసంగాన్ని అడ్డుకున్న సమయంలో జూపల్లి.. దండు నరసింహను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు మల్లు రవి క్షమాపణ చెప్పాలని అంటున్నారు.
రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడైన మల్లురవిపైనే కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు చేయడం ఆ పార్టీలో అంతర్గత విభేదాలకు నిదర్శనంగా చెప్పవచ్చు.