Air Vistara flight : ఢిల్లీ-విజయవాడ ఎయిర్విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన విమానంలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 9:30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఈ విమానం రన్‌వేపై ఉన్నప్పుడే సమస్య తలెత్తింది.
వేగం పుంజుకున్న విమానాన్ని అకస్మాత్తుగా వేగం తగ్గించి రన్‌వే పైనుంచి పక్కకు తీశారు. దాంతో సుమారు 160 మందికిపైగా ప్రయాణికులు మూడు గంటలకుపైగా విమానంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రయాణికులను విమానం నుంచి దింపి ప్యాసింజర్ లాంజ్‌కు తరలించారు.
ఆ విమానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ప్రయాణిస్తున్నారు.
సాంకేతిక లోపం గురించి సిబ్బంది ప్రయాణికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతోపాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తంచేశారు. సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదని, ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఇవ్వడంలేదని ప్రయాణికులు ఆరోపించారు.