Rahul Gandhi : భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. మీరు నిజమైన భారతీయులే అయితే ఇలాంటి మాటలు మాట్లాడరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించింది’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ‘మీరు ప్రతిపక్ష నేత. పార్లమెంటులో చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాలో ఎందుకు ప్రస్తావిస్తారు? 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని మీకు ఎలా తెలుసు?’ అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా 2022 డిసెంబర్లో గల్వాన్ ఘర్షణలపై మాట్లాడారు. గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా సుమారు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఓ రిటైర్డ్ రక్షణ అధికారి లక్నో కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
దాంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం రాహుల్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. లక్నో కోర్టులో జరుగుతున్న విచారణపై స్టే విధిస్తూ రాహుల్ గాంధీకి తాత్కాలిక ఊరటనిచ్చింది. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మాత్రం మాత్రం తీవ్రంగా తప్పుబట్టింది. జాతీయ నాయకులు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది.