Gaddar Awards 2025 | తెలుగు చలనచిత్ర రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘గద్దర్ అవార్డుల’ (2025) విజేతల జాబితా శనివారం అధికారికంగా విడుదలైంది. ఈ ఏడాది అత్యున్నత పురస్కారాల్లో భాగంగా చిత్రసీమకు చెందిన ఇద్దరు దిగ్గజ నటులకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అందించిన అసమానమైన సేవలకు గుర్తింపుగా ఆయనను ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’తో ప్రభుత్వం సత్కరించనుంది. అలాగే వెండితెరపై తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లోకనాయకుడు కమల్ హాసన్‌ను ‘పైడి జయరాజ్ అవార్డు’ వరించింది. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ స్పెషల్ జ్యూరీ అవార్డుల వివరాలను ప్రకటించారు. 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిల్మ్‌ల నుండి ఈ ఎంపిక జరిగింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నటి జయసుధకు ‘ఏఎన్నార్ పురస్కారం’, ప్రముఖ నిర్మాత అశ్విని దత్‌కు ‘నాగిరెడ్డి చక్రపాణి అవార్డు’, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు ‘సినారే అవార్డు’ దక్కాయి. ఈ పురస్కారాలను ఈ నెల మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా ప్రదానం చేయనున్నారు.