మెదక్ : పోలీసు విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, విధులతోపాటు ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వారాంతపు పరేడ్‌లో జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ పాల్గొని, పోలీసు సిబ్బంది అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడ్‌ను పరిశీలించి పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ, శారీరక దృఢత్వంపై పలు సూచనలు చేశారు.
పరేడ్ నిర్వహించడంవల్ల క్రమశిక్షణ, సమయపాలనతోపాటు సిబ్బంది మధ్య సమన్వయం (కో ఆర్డినేషన్) పెరుగుతుందని అన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది తమ విధి నిర్వహణలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. ఒత్తిడితో కూడిన విధుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమం గురించి పోలీసు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18 వరకు “సురక్షితంగా చేరుకోండి (Arrive Alive)” కార్యక్రమం హోం, రవాణా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన, ట్రాఫిక్ నియమాల అమలు, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు.
అలాగే ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు “పిల్లల భద్రత – డ్రగ్స్‌కు నో” కార్యక్రమం పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల రూపంలో నిర్వహించబడుతుందని జిల్లా అదనపు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగనాథ్, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, ఆర్ఐ శైలేందర్, ఎస్సై మల్లికార్జున్, ఆర్ఎస్సైలు సుభాష్, మహిపాల్, భవాని కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.