– జూలూరుపాడు తాసీల్దార్‌కు ఏఐయూకేఎస్ వినతి
జూలూరుపాడు, ఆగస్టు 04 : వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్ శ్రీనివాస్‌కు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ ధర్మ మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో వర్షాలు సకాలంలో, సజావుగా కురుస్తాయంటూ వాతావరణ నిపుణులు ఇచ్చిన అంచనాలు, ప్రభుత్వ ప్రకటనలు నమ్మి రైతులు ఎంతో ఆశతో సాగు పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అయితే ఆచరణలో అక్కడక్కడా స్వల్ప జల్లులు పడటం మినహా వర్షాలు ముఖం చాటేశాయని, భానుడి ప్రతాపానికి, ఎండ తీవ్రతకు వేసిన పంటలన్నీ కళ్లముందే ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్టుబడులు పోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన రైతాంగానికి ప్రభుత్వాలు తక్షణ నష్ట పరిహారాన్ని చెల్లించి భరోసా కల్పించాలని కోరారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సాగుకు అనువుగా ఉండే అన్ని రకాల విత్తనాలను రైతులకు పూర్తి ఉచితంగా సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గతేడాది పంట రుణాల మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ఈ ఏడాది సాగు కోసం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐయూకేఎస్ మండల కార్యదర్శి తోటకూర నరేశ్, నాయకులు పారుపల్లి బాబురావు, ఎస్.మధు, బి.నాగేశ్వరరావు, నరసింహారావు, అప్పారావు పాల్గొన్నారు.