Abhijeet Dipke : సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఫౌండర్ అభిజీత్ దీప్కేపై ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి అనుచరులు తనపై వరుసగా దాడికి పాల్పడ్డారని, దీనికి బాధ్యుడిగా అభిజీత్ దీప్కేను అరెస్టు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశాడు. నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన అనంతరం అభిజీత్ దీప్కేపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా అతడిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. తాజా ఫిర్యాదుకు సంబంధించిన వివరాలివి. ఫైజన్ అన్సారీ అనే అతడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
అతడిపై ఇటీవల పూనేలో, ఔరంగాబాద్‌లో దీప్కే అనుచరులు దాడి చేశారు. ఈ విషయాన్ని ఫైజన్ అన్సారీయే వెల్లడించాడు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, ఈ నేపథ్యంలో అభిజీత్ దీప్కేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదు చేసినట్లు ఫైజన్ పేర్కొన్నాడు. ఇప్పటికే ఇదే అంశంపై రెండు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేశానన్నాడు. ఢిల్లీ పోలీసులు కూడా వెంటనే స్పందించి, దీప్కేను అరెస్టు చేయాలని అతడు కోరాడు. ఇదే సమయంలో ఢిల్లీ పోలీసులు, ప్రభుత్వంపై ఫైజన్ ప్రశంసలు కురిపించాడు. పోలీసులు సరైన సమయంలో స్పందించి, సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేశారని చెప్పాడు. కొద్ది రోజులుగా నిరాహార దీక్ష చేసిన సోనమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వాంగ్చుక్ను పోలీసులు అరెస్టు చేసి, మంచి పని చేశారని, లేకుంటే పరిస్థితులు మరింత దిగజారిపోయేవని ఫైజన్ అన్నాడు.
దీప్కేకు స్వప్రయోజనాలే ముఖ్యమని, ప్రతి అంశాన్ని తన ప్రయోజనం కోసమే వాడుకుంటాడని ఫైజన్ ఆరోపించాడు. అయితే, ఫైజన్ చేసిన ఆరోపణలపై దీప్కే కానీ, సీజేపీ కానీ స్పందించలేదు. దీప్కే చదువు విషయంపై కూడా ఇటీవల ఒక అంశంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అతడి విదేశీ చదువుకు ఎవరు ఖర్చుపెట్టారో, నిధులు ఎలా సమకూరాయో తెలపాలని కోరుతూ అమిత్ తివారి అనే యాక్టివిస్టు ఆర్టీఐని ఆశ్రయించాడు. దీప్కే తండ్రి భగవాన్ రావ్ దీప్కే ఒక జూనియర్ ఇంజనీర్ అని, సగటు ఉద్యోగి తన కొడుకును విదేశాల్లో ఎలా చదివించగలడని తివారి ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో 37 రోజుల నిరసన జరిగిన సంగతి తెలిసిందే. దీనికి అయిన ఖర్చుల గురించి కూడా వివాదం నడుస్తోంది.