అమరావతి : మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాల ( Jurala ) కు వరద కొనసాగుతుండడంతో నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. అక్కడి నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మంగళవారం జూరాల ప్రాజెక్టు 27 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడంతో నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ( Srisailam reservoir) ఎగువ నుంచి జూరాల నుంచి 2.09 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది.
శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 859.3 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 103.8 టీఎంసీల వరకు నీరు నిలువ ఉంది. కర్ణాటకలో భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద కళ వచ్చింది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతుంది.