CEC Gyanesh Kumar : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner) జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) పై విజిలెన్స్ విచారణ (Vigilance Inquiry) కు కేరళ ప్రభుత్వం (Kerala Govt) ఆదేశించింది. ఆయన గతంలో కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (PWD) సెక్రెటరీగా పనిచేసిన సమయంలో వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ విచారణ జరగనుంది. కాంగ్రెస్ నేత (Congress leader) మలయిన్కీళు వేణుగోపాల్ (Malayinkeezhu Venugopal) సమర్పించిన పిటిషన్ ఆధారంగా రాష్ట్ర హోంమంత్రి రమేశ్ చెన్నితాల ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్ట్ (కేఎస్టీపీ) కింద ఎంసీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగస్వామిగా ఉన్న పాటి-బెల్ కన్సార్టియం తరఫున పనిచేసిన మలేషియన్ సివిల్ ఇంజనీర్ లీ సీ బీన్.. కేరళ నుంచి తిరిగి వెళ్లాక 2006 నవంబర్‌లో కౌలాలంపూర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాశారని చెబుతున్న సూసైడ్ నోట్లో అప్పటి పీడబ్ల్యూడీ సెక్రటరీగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ పేరు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రాజెక్టు పనుల్లో అవకతవకలు జరిగాయని, ఈ కేసులో ప్రాథమిక విజిలెన్స్ విచారణ బాహ్య ఒత్తిళ్ల కారణంగా పక్కదారి పట్టిందని వేణుగోపాల్ తన పిటిషన్లో ఆరోపించారు.
ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన హోంమంత్రి రమేశ్ చెన్నితాల నాటి విచారణకు సంబంధించిన ఫైళ్లన్నింటినీ వెంటనే తమకు సమర్పించాలని ‘విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో’ ను ఆదేశించారు. ఆనాటి దర్యాప్తు ఎలా జరిగింది..? నిజంగానే ఏవైనా బయటి శక్తులు దానిని ప్రభావితం చేశాయా..? అనే కోణంలో ఈ ఫైళ్లను పరిశీలించనున్నారు. నాటి విచారణపై వచ్చిన జోక్యం ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డైరెక్టర్‌ను హోంమంత్రి ఆదేశించారు.
అయితే సూసైడ్ నోట్లో పేరు ప్రస్తావించినంత మాత్రాన, తాజాగా విచారణకు ఆదేశించినంత మాత్రాన జ్ఞానేశ్ కుమార్ తప్పు చేసినట్లు నిర్ధారణ కాదని తెలుస్తున్నది. విజిలెన్స్ దర్యాప్తులో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది.