Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో మరో ఎలిమినేషన్ జరిగినట్లు సమాచారం. నాలుగో వారంలో మోడల్ సృష్టి వ్యాకరణం హౌస్ నుంచి బయటకు వచ్చారని తెలుస్తోంది. అగ్నిపరీక్షలో సత్తాచాటి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆమె.. నాలుగు వారాలకే తన ప్రయాణాన్ని ముగించుకున్నట్లు తెలుస్తుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సృష్టి వ్యాకరణం.. అగ్నిపరీక్ష రెండో సీజన్లో కామనర్‌గా పోటీ పడింది. అక్కడ తన ఆటతీరుతో ఆకట్టుకుని బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో గేమ్ ఆడేందుకు ప్రయత్నించింది.
అయితే రెండో వారంలో ఆమె ఆట ఆశించిన స్థాయిలో కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా సృష్టికి గేమ్‌పై మరింత దృష్టి పెట్టాలని సూచించిచారు. మూడో వారం నామినేషన్ల సమయంలో సృష్టి వ్యాకరణం, సుధీర్ మధ్య జరిగిన వివాదం హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుధీర్‌తో తనకు ఏదో ప్రత్యేకమైన అనుబంధం ఉందన్న ప్రచారంపై సృష్టి తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో సృష్టి తీవ్ర ఆగ్రహానికి గురై సుధీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ గొడవ తర్వాత ఆమె గేమ్ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిందనే చర్చ మొదలైంది. చివరకు ఇదే అంశం ఆమెకు మైనస్‌గా మారిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
నాలుగో వారం ఎలిమినేషన్ కోసం మొదట సృష్టి వ్యాకరణంతో పాటు దేబ్జానీ, అమన్ తదితరులు డేంజర్ జోన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. చివరి దశలో ఓటింగ్‌లో పరిస్థితులు మారినప్పటికీ.. సృష్టికే తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను హౌస్ నుంచి ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎలిమినేషన్ వివరాలు వెల్లడయ్యే వరకు ఈ సమాచారం పూర్తిగా ధృవీకరించాల్సి ఉంది. సృష్టి వ్యాకరణం బిగ్‌బాస్ హౌస్‌లో నాలుగు వారాలు ఉన్నట్లు సమాచారం. ఆమెకు వారానికి సుమారు రూ.75 వేల చొప్పున రెమ్యునరేషన్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన నాలుగు వారాలకు దాదాపు రూ.3 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది.
ఇక బిగ్‌బాస్‌లోకి రాకముందు అగ్నిపరీక్షలో పాల్గొన్నందుకు ఆమెకు సుమారు రూ.50 వేల పారితోషికం లభించినట్లు సమాచారం. అంటే అగ్నిపరీక్ష పారితోషికాన్ని కూడా కలుపుకుంటే సృష్టి వ్యాకరణం మొత్తం సుమారు రూ.3.5 లక్షలు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెమ్యునరేషన్ వివరాలపై అధికారిక ధృవీకరణ లేదు.