– అధికారుల నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం
రుద్రంపూర్, ఆగస్టు 04 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ సీఈఆర్ (CER) క్లబ్ ప్రవేశ ద్వారం వద్ద చిన్నపాటి వర్షానికే భారీగా నీరు నిలిచిపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులు తమ కుటుంబాల్లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక వేడుకలను ఈ క్లబ్‌లోనే నిర్వహించుకుంటారు. అయితే ప్రతి వర్షానికీ క్లబ్ ప్రధాన ద్వారం ముందే నీరు నిలిచి బురదమయంగా మారుతుండటంతో కార్యక్రమాలకు హాజరయ్యే అతిథులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఇది అధికారుల క్లబ్ కాకపోవడం వల్లే నిర్వహణపై నిర్లక్ష్యం చూపుతున్నారా?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కనీసం వర్షపు నీరు బయటకు వెళ్లేలా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత సింగరేణి అధికారులు తక్షణమే స్పందించి, ప్రవేశ ద్వారం వద్ద నీరు నిల్వ కాకుండా శాశ్వత డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న సమస్యగా కనిపిస్తున్న ఈ అంశం, ప్రతి వర్షంలో కార్మికులకు ,వారి కుటుంబాలకు పెద్ద ఇబ్బందిగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.