Kamal Hassan : నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య (Education) మాత్రమేనని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha member) కమల్ హాసన్ (Kamal Hassan) అన్నారు. సినీ నటుడు సూర్య (Actor Surya) కు ఎడ్యుకేషన్ చారిటీ అయిన అగరం ఫౌండేషన్ (Agaram foundation) ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలు మరే ఆయుధాన్ని చేతిలోకి తీసుకోకుండా కేవలం విద్యను మాత్రమే గట్టిగా పట్టుకోవాలని కమల్ హాసన్ సూచించారు. విద్య లేకుండా మనం గెలవలేమని, బహుసంఖ్యాక మూర్ఖులు (మూదర్గల్) మనలను ఓడించగలరని వ్యాఖ్యానించారు. అందుకే మనం విద్యను గట్టిగా పట్టుకోవాలని అన్నారు. విద్యా వ్యవస్థలు, సామాజిక సాధికారతపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇక 2017 నుంచి అమల్లో ఉన్న ‘నీట్’ విధానాన్ని కమల్ హాసన్ తీవ్రంగా విమర్శించారు. ఇది ఆర్థికంగా వెనుకబడిన, అణగారిన వర్గాల విద్యార్థుల వైద్య విద్య కలలను నాశనం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. సామాజిక సేవ అనేది ఒక ముళ్ల కిరీటమని అన్నారు. సినిమాలో మంచి నటనకు కిరీటం లభిస్తుందని, సామాజిక సేవకు మాత్రం ముళ్ల కిరీటం లభిస్తుందని వ్యాఖ్యానించారు.
ఆ ముళ్ల కిరీటాన్ని ధరించడానికి బలమైన హృదయం కావాలని కమల్ హాసన్ అన్నారు. సామాజిక సేవను ఎవరూ మన కోసం చేయరని, మనమే చేయాలని సూచించారు. నాయకత్వం అంటే ఒక స్థానంలో కూర్చుని పాలించడం కాదని, సమాజంలో కనిపించకుండా సేవ చేయడమని కమల్ హాసన్ అన్నారు.