హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27: బీజేపీ, టీడీపీకి కోవార్టుగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ చేసి మాలలను అణచివేసే కుట్రలు చేస్తున్నారని మాల సంఘాల జాక్ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar) మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు మూలంగా మాలలు విద్యా, ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
మాల సంఘాల విద్యార్థి జాక్ రాష్ర్ట చైర్మన్ మదాసి రాహుల్‌రావు మాట్లాడుతూ అశాస్త్రీయమైన ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలను అణచివేసే కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాలలకు రిజర్వేషన్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మాలలకు ద్రోహం చేసిన సీఎం రేవంత్‌రెడ్డిని ఏ పార్టీలో ఉన్న వెంటాడి ఒడిస్తామని వారు హెచ్చరించారు.
మాల సంఘాల జాక్ గౌరవాధ్యక్షుడు చెరుకు రాంచందర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి-చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడుస్తూ మాలలకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డి పట్ల ఆప్రమత్తంగా ఉండి, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పునః పరిశీలించాలని లేకుంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగ్గిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. సమావేశంలో నాయకులు బండి అశోక్, కంకణాల సంతోష్, దండు మోహన్, పానుగంటి లక్ష్మీనారాయణ, దండ్రి శ్రీనివాస్, గురిమిల్ల రాజు, శేషాద్రి, నాగులు, కునముల్ల అనిత, దావా రవి పాల్గొన్నారు.