మానకొండూర్ నియోజక వర్గంలో వెలుగుచూసిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల గోల్మాల్ ఉదంతంలో బాధ్యులపై చర్యల్లేవు. బాధితులకు నేటికీ ఆ సీఎంఆర్ఎఫ్ సాయం అందలేదు.
శంకరపట్నం, మార్చి 3: పేదల కన్నీళ్లు తుడవాల్సిన సీఎం సహాయనిధి పక్కదారి పడుతున్నది. ప్రభుత్వ పట్టింపులేమి.. నిర్లక్ష్యంతో.. అడ్డదారుల్లో అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నది. దవాఖానలో చికిత్సకు పెట్టిన ఖర్చుల్లో తృణమో.. పణమో వచ్చిన సాయం అవినీతిపరుల అకౌంట్లలో జమైపోతుండగా, చెక్కు రేపోమాపో వస్తుందని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగులుతున్నది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలో వరుస ఘటనలు వెలుగు చూస్తున్నా, నిజాలు నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది.
గత రెండేండ్లుగా సీఎం సహాయనిధి చెక్కులలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బాధితులకు బీఆర్ఎస్ నాయకులు అండగా నిలబడి లబ్ధిదారుల తరఫున పోరాడుతున్నారు. బీఆర్ఎస్ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొయ్యడ పర్శరాములు, గద్దపాక మాజీ సర్పంచ్ గోపు విజయ్‌కుమార్‌రెడ్డి, తదితర నాయకులు చెక్కుల పంపిణీలో అవకతవకలను వెలుగులోకి తెచ్చారు.
శంకరపట్నం మండలం కరీంపేట్‌కు చెందిన చింతం తిరుపతి అనారోగ్యానికి గురై, సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా, 2024 డిసెంబర్లో రూ.60 వేలు మంజూరయ్యాయి. ఫిబ్రవరి 19, 2025న ఇతరుల పేరున డ్రా చేసుకున్నట్టు తేలింది. ఇదే గ్రామానికి చెందిన గుర్రం రమేశ్ ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటుండగా విధివశాత్తు పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యాడు. ఇతడికి డిసెంబర్ 12, 2024న రూ.38 వేలు మంజూరు కాగా, ఇప్పటి వరకు చెక్కు చేరలేదు. ఇదే గ్రామానికి చెందిన కేతిరి శ్రీనివాస్‌రెడ్డి అనారోగ్యం బారినపడగా, రూ. 31,500 మంజూరయ్యాయి.
ఈ చెక్కు డబ్బులు కన్నాపూర్‌కు చెందిన మరో శ్రీనివాస్‌రెడ్డి అకౌంట్లో వేయించి డ్రా చేసుకున్నారు. ఈ విషయం మీడియా ద్వారా బహిర్గతం కావడం అప్పట్లో కలకలం రేపింది. అక్రమంగా కాజేసిన నిధులు, కోర్టులో రికవరీ అయ్యే వరకు వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. గద్దపాకకు చెందిన ఓ వీవోఏ అదే గ్రామానికి చెందిన ముదిగంటి విజయలక్ష్మి అకౌంట్లో వేరొకరి సీఎంఆర్ఎఫ్ చెక్కు డబ్బులు రూ.21,500 వేయించారు. ఆ డబ్బులు తన సోదరుడివంటూ తర్వాత తీరిగ్గా తన అకౌంట్లోకి మళ్లించుకున్నది. ఈ వ్యవహారం పూర్తి ఆధారాలతో బయటపడటంతో తిరిగి బాధిత మహిళనే బెదిరింపులకు గురిచేయడం గమనార్హం. ఎరడపల్లిలో రంగు శ్రీనివాస్, లింగాపూర్ లో ఎన్నారపు శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి చెక్కులు పక్కదారి పట్టడం, ఆముదాలపల్లిలో అనుకూరి సదాశివరెడ్డి, తాడికల్, చింతగుట్ట, తదితర గ్రామాల్లో మరెన్నో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
లబ్ధిదారులకు చెక్కులు మంజూరైనతేదీ, చెక్కు నంబర్, అమౌంట్, తదితర వివరాలు తెలిసినా, తమ చెక్కులు మాత్రం ఎవరి వద్ద ఉన్నాయో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒక్క శంకరపట్నం మండలంలోనే ఈ స్థాయిలో అక్రమాలు జరిగితే నియోజకవర్గ స్థాయిలో ఏ మేరకు అక్రమాలు జరుగుతున్నాయోనని జనం బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు అర్హులైన లబ్ధిదారులు రెండేండ్లుగా చెక్కుల కోసం ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిద్దుబాటు చర్యలకు పూనుకుని బాధితులకు న్యాయం చేస్తారని వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు.
గద్దపాక గ్రామానికి చెందిన ముదుగంటి విజయలక్ష్మి ఖాతాలో ఆమెకు తెలియకుండానే డబ్బులు జమ కావడంతో అవాక్కైంది. ఇదే సమయంలో పోలీసులు ఎంక్వైరీలో భాగంగా ఆమెను విచారణకు పిలవడంతో భయపడిపోయింది. తనకు సంబంధంలేని వ్యవహారంలో తమను ఇరికించినట్టు గుర్తించిన విజయలక్ష్మి కుటుంబసభ్యులు చివరకు బీఆర్ఎస్ నాయకుల సాయంతో కరీంనగర్ వెళ్లి కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేశారు. చెక్కు గోల్మాల్ వ్యవహారంలో తమకు సంబంధం లేదని, తమకు తెలియకుండానే వీవోఏ తెలివిగా ఈ తంతు నడిపించారని, సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల కేసులో ఎలాంటి ఒత్తిడులతో పని చేయడం లేదు. నిబంధనల మేరకే కేసు ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అంశంలో ఆధారాలు ఉంటే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరికి అనుమానాలు ఉన్నా లాయర్‌తో వచ్చి కేసు దర్యాప్తు వివరాలు పొందవచ్చు. చట్టప్రకారమే దర్యాప్తు కొనసాగుతున్నది.
– కే శేఖర్‌రెడ్డి, కేశవపట్నం, ఎస్ఐ
చాలాకాలంగా మా కార్యాలయం ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడంలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ద్వారానే అందజేస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ, అక్విటెన్స్ వివరాల జాబితా మా వద్ద ఉండదు.
– సురేఖ, తహసీల్దార్, శంకరపట్నం
నేను ఆటో నడిపితేనే ఇల్లు గడుస్తది. నాలుగేండ్ల కింద పక్షవాతం వచ్చింది. దవాఖానల చుట్టూ తిరిగినం. రూ.3 లక్షలు ఖర్చయినయ్. నిన్నమొన్నటి వరకు మంచం దిగలేదు. ఇప్పుడిప్పుడే నాలుగడుగులు ఏత్తన్న. సీఎం సాయం కోసం దరఖాస్తు చేస్తే రూ.38 వేలు వచ్చినట్టు సెల్‌కు మెసేజ్ వచ్చింది. చెక్కు మాత్రం ఎవరూ ఇయ్యలేదు. మా కొడుకు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకుపోయి అడిగిండు. మీ చెక్కు రిటర్న్ పోయింది అన్నరు. పేరు, అడ్రస్ వివరాలు తీసుకొని మళ్ల తెప్పించి ఇస్తం అన్నరు. ఇప్పటికీ ఇయ్యలేదు.
– గుర్రం రమేశ్, కరీంపేట్
నాకు అప్పట్లో ఎనీమియా వచ్చింది. బీపీ, షుగర్ అటీటై నోటిమాట పడిపోయింది. ట్రీట్మెంట్కు రూ.1,38,000 ఖర్చయింది. సీఎంఆర్ఎఫ్కు ఐప్లె చేసుకున్నం. 2024లో రూ.31,500 చెక్కు మంజూరైనట్టు తెలిసింది. చాలా కాలం వెయిట్ చేసినా చెక్కు ఎవరూ ఇవ్వలేదు. అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే కన్నాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అకౌంట్లో జమైనట్టు తెలిసింది. మీడియా ద్వారా బయటకు రావడంతో ఎమ్మెల్యే పీఏ ఫిర్యాదుతో పోలీసులు సదరు శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. పక్కదారి పట్టిన సొమ్ము రికవరీకి కోర్టు ఆదేశించింది. ఇంత జరిగినా దీనికి బాధ్యులైన వారిని గుర్తించి శిక్షించకపోవడం బాధాకరం.
– కేతిరి శ్రీనివాస్‌రెడ్డి, కరీంపేట్
నాలుగేండ్ల కింద మా ఆయన లింగయ్యకు కిడ్నీ పాడైతే డాక్టర్లు ఆపరేషన్ చేసిండ్రు. తర్వాత రెండేండ్ల కింద కోమాలోకి పోయిండు. ఆ రెండేండ్ల సంది దవాఖానలు తిరుగతనే ఉన్నం. 2 లక్షలు ఖర్చయినయ్. 2025 జనవరి 6న రూ.34 వేల చెక్కు వచ్చినట్టు ఊరి లీడర్ల ద్వారా మా కొడుకుకు తెలిసింది. అప్పటి నుంచి చెక్కు ఇగిస్తరో అగిస్తరో..? అని ఎదురు చూసినం. ఆశలు అడియాశలే అయినయ్. ఆగస్ట్ నెలల మా ఆయన చనిపోయిండు. మా చెక్కు వచ్చినట్టు నంబర్‌తోసహా లీడర్లు చెబుతున్నా నా చేతికి మాత్రం ఇంకారాలే.
– బొజ్జ సత్తమ్మ, కరీంపేట్
మా ఊరి సీఏ లక్ష్మి మా తమ్ముడి పైసలని నన్ను నమ్మించి నా అకౌంట్ల రూ.21,500 వేసింది. తర్వాత మా కొడుకుతోని ఫోన్ పే చేయించుకుంది. తర్వాత పోలీస్‌లు పిలిస్తే పోలీస్ స్టేషన్‌కు పోయినం. వేరేవాళ్ల చెక్కు డబ్బులు మీ అకౌంట్లోకి ఎట్ల వచ్చినయ్..? మీ మీద కేసైతదని పోలీసులు చెప్పడంతో ఎంతో భయపడి పోయినం. అక్కడినుంచి వెంటనే బ్యాంకుకు పోయి చూస్తే వేరేటోళ్ల చెక్కు మా అకౌంట్ల వేసినట్టు తెలిసింది. తెలిసిన వ్యక్తి అని నమ్మి మోసపోయినం. ఇంత జరిగినా మమ్మల్నే బెదిరించిండ్రు. ఇందులో మోసాన్ని బయటకు తీసి మాకు న్యాయం చేసి నిందితులను శిక్షించాలని కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినం.
– ముదిగంటి విజయలక్ష్మి, గద్దపాక