వనపర్తి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీ పీఠాలపై నలుగురు చైర్పర్సన్లు కొలువుదీరారు. వీరికి తోడు మరో 47 వార్డుల్లో కౌన్సిలర్లుగా మహిళలే గెలుపొందారు. దీంతో జిల్లాలో ఏ మున్సిపాల్టీలో చూసినా మహిళా రాజ్యం కనిపిస్తున్నది. వనపర్తి పురంలో జనరల్ మహిళ, కొత్తకోట, ఆత్మకూరు మున్సిపాలిటీల్లో బీసీ మహిళ, అమరచింత, పెబ్బేరు జనరల్ అభ్యర్థులకు రిజర్వ్ అయ్యాయి. అయితే, వీటిలో జనరల్‌కు కేటాయించిన అమరచింతలో మహిళ సభ్యురాలు చైర్‌పర్సన్‌గా ఎంపిక అయ్యారు. వనపర్తిలో మాధవి, ఆత్మకూరులో నాగ మణి, కొత్తకోటలో అరుణ, అమరచింతకు సువర్ణ చైర్పర్సన్లుగా ఎన్నిక కాగా.. పెబ్బేరు నుంచి శ్రీనివాస్‌గౌడ్ చైర్మన్‌గా ఎన్నికవ్వడం ప్రాధాన్యతగా నిలిచింది. అయితే అంతా మహిళల ఆధిపత్యమే కనిపించింది.
పురుషుల కంటే ఎక్కువే..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల వారీగా చూస్తే.. మహిళా వార్డు సభ్యుల సంఖ్య అధికంగా ఉన్నది. 40 స్థానాలు వుమెన్‌కు రిజర్వేషన్ కాగా.. మరో 7 జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసి గెలుపొందారు. ఇలా మొత్తం 47 మంది వరకు ఉన్నారు. కొన్ని స్థానాల్లో మహిళల ఓట్లు ఎక్కువగా ఉండటం కూడా వీరికి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఇవే కాకుండా 5 మున్సిపాలిటీల వారీగా కూడా మహిళా ఓటర్లు, పురుషుల కంటే ఎక్కువ ఉన్నారు. పోలింగ్ అయిన ఓట్ల పరంగా పరిశీలించినా.. మహిళలు, పురుషుల కంటే అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇలా అన్ని రకాలుగానూ మహిళల సంఖ్యే అధికంగా ఉండటంపై వచ్చే రోజులు ఎలా ఉంటాయో అంచనా వేసుకోవాలి మరి. ఈ దఫా మున్సిపల్ పాలనలో మహిళా నారీమణుల ముద్ర కనిపించనున్నది.
మహిళల ప్రాతినిథ్యమే..
వనపర్తి జిల్లాలో 5 మున్సిపాల్టీలకు ఇటీవల ఎన్నికల ప్రక్రియ ముగియగా.. కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులు, పెబ్బేరులో 12, కొత్తకోటలో 15, ఆత్మకూరులో 10, అమరచింతలో 10 వార్డులు కలిపి జిల్లాలో మొత్తం 80 వరకు ఉన్నాయి. ఇందులో మహిళలకు 40 స్థానాలు రిజర్వేషన్ కాగా.. ఇవే కాకుండా మరికొన్ని జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసి గెలుపొందారు. దీంతోపాటు చైర్మన్, వైస్‌చైర్మన్ స్థానాలను దృష్టిలో పెట్టుకుని భర్తలకు నిలబడే అవకాశం ఉన్నా..భార్యలను బరిలో నిలపడంతో రిజర్వేషన్ల సంఖ్య కంటే కూడా మున్సిపల్లో మహిళా ప్రజాప్రతినిధులప్రాతినిథ్యమే మెజారిటీగా కనిపిస్తుంది.
