హైదరాబాద్, మార్చి 3(నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు చెందిన రూ.69కోట్లు ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి కంపెనీకి చేరినట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలింది. అయితే అసోసియేషన్ కార్యవర్గం మాత్రం తేలుకుట్టిన దొంగల్లా తమకేం సంబంధం లేదంటూ ఈ వ్యవహారం నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. 22ఏండ్ల కిందటి వివాదాన్ని అడ్డుపెట్టుకొని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి చక్రం తిప్పి, రూ.69కోట్లను తరలించిన వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టిన సంగతి తెలిసిందే.
‘హెచ్‌సీఏ నిధుల లూటీ’ పేరుతో ప్రచురితమైన కథనం ఇటు క్రీడావర్గాల్లో, అటు ప్రభుత్వవర్గాల్లో సంచలనంగా మారింది. దీంతో హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు మంగళవారం జింఖానా మైదానంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హెచ్‌సీఏ నుంచి విశాఖ ఇండస్ట్రీస్‌కు నగదు బదిలీ విషయంలో తన ప్రమేయం లేదని నూతన అధ్యక్షుడు అమర్నాథ్ చెప్పుకొచ్చారు. తాను ఫిబ్రవరి 3న హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియామకం అయ్యానని, అంతకుముందే నిధులు అసోసియేషన్ నుంచి బదిలీ జరిగినట్టు తెలిపారు. ఈ విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని, తాను ఎలాంటి పత్రాలపైనా సంతకాలు చేయలేదని స్పష్టంచేశారు. అయితే ‘అప్పటికే అసోసియేషన్‌లో కీలక స్థానంలో ఉన్న మీకు తెలియకుండా నిధులు ఎలా బదిలీ అయ్యాయి?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అమర్నాథ్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. జనవరి 3న ప్రిన్సిపల్ స్పెషల్ కోర్టు రూ.68,73,19,584ను డీడీ చేయాలని ఆదేశాలు ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు.
‘2004లో మొదలై 22ఏండ్ల పాటు వివిధ కోర్టుల్లో నలుగుతూ వచ్చిన హెచ్‌సీఏ-విశాఖ వివాదం మీరు బాధ్యతలు తీసుకున్న వారంలోనే ఎలా పరిష్కారమైంది?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన దగ్గర స్పందన లేకపోయింది. మరోవైపు విశాఖ ఇండస్ట్రీస్‌తో మధ్యవర్తిత్వం విషయంలో నిరుడు సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్‌కు అవకాశం ఇచ్చిందని, అయినా హెచ్‌సీఏ ఎందుకు దాఖలు చేయలేకపోయిందన్న దానికి కార్యవర్గ సభ్యుల మౌనమే సమాధానం అయ్యింది.

మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే నిధుల బదిలీ జరిగిందని చెప్పారు. హెచ్‌సీఏ అకౌంట్ నుంచి బదిలీ అయిన నిధులను ప్రస్తుతం బ్యాంక్ నిలిపివేసిందని పేర్కొన్నారు. వాటిని హెచ్‌సీఏ క్రికెట్ అభివృద్ధికి వినియోగించేందుకు విశాఖ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ చెప్పుకొచ్చారు. మొత్తంగా కార్యవర్గ సభ్యులు మంత్రి తరఫున వకాల్తా పుచ్చుకొంటూ, మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్ హయాంలోనే ఇదంతా జరిగిందని తప్పించుకొనేందుకు దారులు వెతికారని విమర్శలు వినిపిస్తున్నాయి.
హెచ్‌సీఏకు, దివంగత కాంగ్రెస్ మాజీ ఎంపీ వెంకటస్వామి(కాకా)కి ఏం సంబంధం అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు హెచ్‌సీఏ సభ్యులు నీళ్లు నమిలారు. బీసీసీఐ నుంచి క్రికెట్ అభివృద్ధి కోసం నిధులు మంజూరవుతున్నా, కాకా పేరున అంతర్‌జిల్లాల టీ-20 క్రికెట్ టోర్నీ నిర్వహించాల్సి వచ్చిందన్న దానిపై సంయుక్త కార్యదర్శి బసవరాజు సమాధానిమిచ్చే ప్రయత్నం చేశారు. కాకా పేరున జరిగిన టోర్నీకి హెచ్‌సీఏ అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. టోర్నీకి మంత్రికి చెందిన కంపెనీ మెయిన్ స్పాన్సర్‌గా వ్యవహరించిందని తెలిపారు.
సస్పెన్షన్‌కు గురైన జగన్మోహన్రావు స్థానంలో మీ నియామకం చెల్లదన్న మీడియా ప్రతినిధి ప్రశ్నపై అమర్నాథ్ స్పందించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఒక ఓటు తేడాతో రెండో స్థానంలో నిలిచానని, అంబుడ్స్‌మన్ ఆదేశాల మేరకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. తన నియామకంపై కోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తున్నందున దానిపై తాను మాట్లాడలేనని సమాధానం దాటవేశారు. అధ్యక్ష పదవికి రెండో స్థానంలో నిలిచిన మిమ్నల్ని ఎన్నుకున్నట్టే కార్యదర్శి, కోశాధికారికి అదే రీతిలో అవకాశమివ్వచ్చు కదా? అనే అంశంపై స్పందిస్తూ వాళ్ల విషయంలో నిబంధనలు వేరని చెప్పుకొచ్చారు.
హెచ్‌సీఏలో నెలకొన్న రూ.69 కోట్ల నిధులు లూటీపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హెచ్‌సీఏ సభ్యుల మీడియా సమావేశం జరుగుతున్న సమయంలో ఆయన ఆధ్వర్యంలో క్రికెట్ సంఘాలు మెరుపు ధర్నా నిర్వహించాయి. పెద్ద ఎత్తున హెచ్‌సీఏ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రూ.నాలుగు కోట్లు ఇచ్చి రూ.69 కోట్లు కొల్లగొట్టిన దొంగల ముఠాను హెచ్‌సీఏ నుంచి తరిమికొట్టాలని అల్లీపురం డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ నిధులు వెనుకకు రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా టీడీసీఏ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ధర్నాలో స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్, కార్యదర్శి వినోద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజుగౌడ్, వెంకటేశ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.