బర్మింగ్‌హామ్: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్ సూపర్ 1000 టోర్నీ తొలిరౌండ్లోనే అదరగొట్టాడు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో అతడు.. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ షి యు కి (చైనా)కు షాకిచ్చి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్.. 23-19, 19-21, 21-17తో చైనా షట్లర్‌కు షాకిచ్చాడు. 78 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఉత్కంఠ పోరులో ఇద్దరూ తలో గేమ్ నెగ్గారు. దీంతో రసవత్తరంగా సాగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ 6-6తో ఉన్న సేన్.. ఆఖరి విరామానికి ముందు 11-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అక్కడ్నుంచి ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ ఓటమి పాలవ్వగా మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల-తనీషా క్రాస్టో 21-17, 21-19తో హో పాంగ్ రాన్-చెంగ్ సు యిన్ (మలేషియా)ను చిత్తుచేసింది.