KTR | ఆదిలాబాద్ : గుజరాత్లో పత్తికి మద్దతు ధర ఇచ్చినట్టే.. తెలంగాణలో పండించిన పత్తికి కూడా మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే స్థానికంగా ఉన్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వెంట పడుతాం.. వదిలిపెట్టం అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన రైతు పోరుబాట మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఒక్క కాంగ్రెసోళ్లే మోసగాళ్లు కాదు.. అంతకంటే పెద్ద మోసగాళ్లు బీజేపోళ్లు కూడా. కాంగ్రెస్, బీజేపీ వేర్వేరు కాదు.. దొందు దొందే. ఇక్కడ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నారు. గుజరాత్లో పత్తి పండించే రైతు రైతు.. కానీ ఆదిలాబాద్‌లో పత్తి పండించే రైతు రైతు కాదా..? గుజరాత్లో పత్తికి రూ. 8800 మద్దతు ధర ఇస్తున్నారు. మన తెలంగాణ ఆదిలాబాద్‌లో సీసీఐ ద్వారా రేపట్నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయట. గుజరాత్లో ఇచ్చినట్టు ఇక్కడ కూడా మద్దతు ధర ఇవ్వకుంటే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వెంటపడుతాం.. వదిలిపెట్టం. గుజరాత్‌కు ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతి ఉంటుందా..? గుజరాత్ పత్తి కంటే మన పత్తి క్వాలిటీ ఉంటుంది. ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ కంటే మీ దగ్గర క్వాలిటీ పత్తి పండుతుంది.. తప్పకుండా దీన్ని బ్రాండింగ్ చేసి ప్రమోట్ చేయండి.. పరిశ్రమలు వస్తే రైతులకు లాభం జరుగుతదని మా హయాంలో ఇతర రాష్ట్రాల అధికారులు చెప్పారు. పత్తి రైతులకు మధ్దతు ధర ఇవ్వాలి. రైతుబంధు, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడినట్టే.. బీజేపీ వెంట పడుతామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
మాకు ఓట్లేసి గెలిపిస్తే.. స్థానికంగా ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రారంభిస్తామని బీజేపీ నేతలు చెప్పారు. మోదీ, అమిత్ షా, ఇప్పుడున్న ఎంపీ మాటిచ్చారు. ఇంతవరకు ఏం లేదు. ఢిల్లీలో జుమ్లా ప్రధాని.. హైదరాబాద్ గల్లీలో హౌలా సీఎం ఉన్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెసోళ్లు చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ. 20 వేల కోట్ల చొప్పున ఇస్తామన్నారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, యువజన, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి అందర్నీ మోసం చేశారు. ఇంకా మూడేండ్ల సమయం ఉంది. ఈ మూడేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రైతుల కల్లాల వద్దకు మనమే పోదాం.. అక్కడ రైతులతో మాట్లాడి బోనస్‌పై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. పత్తి కేంద్రాల వద్ద బీజేపీ నేతలను నిలదీద్దాం. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినే కాదు.. భారత రైతు సమితి కూడా. రైతుల పక్షాన ఉండి గట్టిగా పోరాడుతాం. ఈ ప్రభుత్వానికి సంవత్సరికం కూడా పెట్టేది ఉంది. ఇప్పుడే మొదలైంది పోరాటం. తొలిమాసిక పెట్టే రోజు వస్తది. ఈ రోజు అద్భుతంగా రైతన్న కోసం జోగు రామన్న కదిలిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్రహ్మాండంగా కదులుతాం.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేదాకా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ లుచ్చాగాళ్లకు ఓట్లేయొద్దని మహారాష్ట్రలో చెప్పండి : కేటీఆర్
KTR | ప్రజలు, రైతుల కోసం జైలుకు పోవడానికి రెడీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | మహారాష్ట్రకు వందల కోట్ల నగదు..! కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ : కేటీఆర్
MLC Jeevan Reddy | పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నాను : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి