హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం కష్టమే. నగరం 360 డిగ్రీల కోణంలో ఓ వృత్తం మాదిరిగా అభివృద్ధి చెందుతున్నది. మిగిలిన నగరాల మాదిరిగా కేవలం ఏదో ఒక దిక్కుకే పరిమితం కాలేదు. హైదరాబాద్ ప్రగతి అంతా ఈ వృత్తాకార అభివృద్ధిలోనే ఇమిడి ఉన్నది. ఇదే నగరాన్ని ఓ ప్రత్యేక స్థాయిలో నిలుపుతున్నది. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ ఇలా దశలవారీగా విస్తరిస్తూ పోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో నగర పాలనకు విశిష్టమైన విధానాన్ని రూపొందించాల్సి ఉండగా, ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనే చేయడం లేదు.
హైదరాబాద్ మహానగరం అయిదారు జిల్లాలకు విస్తరించింది. పరిపాలనా సౌలభ్యం కోసమని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. 300 డివిజన్లు ఏర్పాటు చేసింది. ఒక్కో కార్పొరేషన్లో దాదాపుగా 100 డివిజన్ల వరకు ఉంటాయి. శివారులోని 27 మున్సిపాలిటీలు మహానగరంలో విలీనమయ్యాయి. గతంలో కలిసిపోయిన మున్సిపాలిటీలకు ఇవి అదనం. ఒక్కో కార్పొరేషన్ భేటీ దాదాపుగా రాష్ట్ర శాసనసభ అంత ఉంటుంది. సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలైంది. కార్పొరేషన్లు అంటే స్థానిక స్వపరిపాలనకు ప్రతిరూపం. నూతన విధానంలో స్థానికత లేదు. స్వపరిపాలన కూడా లేదు. ఏదో ప్రాచీనకాలం నాటి ‘నగర రాజ్యం’గా కనిపిస్తున్నది.
అసెంబ్లీ లాంటి కార్పొరేషన్ సమావేశంలో స్థానిక సమస్యలను ప్రస్తావించే అవకాశం అసలు కార్పొరేటర్‌కు వస్తుందా? అసెంబ్లీ మాదిరిగా కార్పొరేషన్ సమావేశాలేవీ వారాల తరబడి జరగవు. అలాంటప్పుడు స్థానిక సమస్యలు చెప్పేందుకు, వినేందుకు అవకాశం ఎక్కడిది? చర్చలు జరగాలన్న ప్రజాస్వామ్య మూల సూత్రానికే అవకాశం లేనప్పుడు నగర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అంతా అధికారస్వామ్యం అయినప్పుడు ప్రజల గొంతుకను వినిపించేవారెవరు? నగరంలోని బస్తీలు, మురికివాడల గురించి మాట్లాడే అవకాశమే దొరకదు.
డివిజన్లను ఏ ప్రాతిపదికన విభజించారనే దానిపైనే ఇంకా స్పష్టత లేదు. ఎంత జనాభాను ప్రామాణికంగా తీసుకున్నారు? ఆదాయ, పన్ను మార్గాలను గుర్తించారా? చారిత్రక నేపథ్యాలను పట్టించుకున్నారా? ఇవేవీ ప్రజల్లో నిత్యం తిరిగే రాజకీయ నాయకులకు సైతం తెలియదు. ఎంతో చరిత్ర ఉన్న సికింద్రాబాద్ పేరు కనుమరుగైంది. తనకంటూ గుర్తింపు పొందిన బాలాపూర్ మున్సిపాలిటీ కూడా లేదు. ఇలా చెప్పుకొంటూపోతే మహానగరంలోని ప్రతి ప్రాంతానిదీ ఒక ప్రత్యేకతే. ఆ పేరుతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఓ అనుబంధం ఉంటుంది.
కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రజలు దశాబ్దాల కాలంగా ఎన్నో పోరాటాలు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజల కోసం పరిపాలనను వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేవిధంగా చూడాలని ఎంతగానో తపన పడ్డారు. అందుకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉన్నత కమిటీ వేసి, ఆ కమిటీకి హోం మంత్రిని చైర్మన్‌గా నియమించి, ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. అదే విధంగా కొత్త మండలాలు, గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డివిజన్లను రేవంత్ సర్కార్ అశాస్త్రీయబద్ధంగా ఏర్పాటు చేస్తున్నది. ఈ విషయంలో ప్రజాసేకరణ చేయకుండా ముందుకు సాగుతున్నది. కానీ ఇదంతా తెలంగాణ సమాజం గమనిస్తున్నది. డివిజన్ల విభజనకు పరోక్ష పద్ధతిని కూడా పరిశీలించవచ్చు. అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో అపెక్స్ బాడీ మేయర్‌ను, ఇతర సభ్యులను ఎన్నుకోవచ్చు. ప్రత్యక్ష ఎన్నికల విధానం అయితే ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించే అవకాశం ఉండడంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ తరహా ఎన్నికలే మేలైన విధానంగా భావించవచ్చు. ఈ రెండంచెల వ్యవస్థల మధ్య అధికారాలు, బాధ్యతలు, నిధుల విభజన స్పష్టంగా ఉండాలి. జవాబుదారీతనాన్నీ చెప్పగలగాలి.
తెలంగాణ చరిత్ర చూస్తే మున్సిపాలిటీలు.. కేంద్రీకృత కార్పొరేషన్ వ్యవస్థల ఏర్పాటే హైదరాబాద్ మహానగరానికి సరైన విధానం అని అనిపిస్తున్నది. ‘స్థానికత’, ‘స్వపరిపాలన’ అనే మాటలే తెలంగాణ ఉద్యమానికి శ్వాసగా నిలిచాయి. మూడు కార్పొరేషన్ల విధానంలో ఈ రెండింటికీ దెబ్బ తగులుతుంది. స్థానిక సంస్థలు అనే మాటకే అర్థం లేకుండా పోతుంది. జిల్లాలు జిల్లాలకే విస్తరించి, దాదాపు కోటిన్నర జనాభా కలిగిన నగరాన్ని స్థానిక సంస్థ అని పిలువడం అంత సబబు కాదు. తాజా వ్యవస్థలో కార్పొరేటర్‌ను కలువడమే ప్రజలకు కష్టమవుతుంది. నిజానికి అందరికీ సమయం ఇవ్వడం కూడా కార్పొరేటర్‌కు సమస్యగా మారుతుంది. దాని బదులు మహానగరాల్లో రెండంచెల విధానం అమలు చేయడమే శ్రేయస్కరం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)
– గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817