రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, స్వరాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధితో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే స్ఫూర్తితో నిరుడు తెలంగాణ ఆవిర్భావోత్సవాలను అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించింది. ఈ ఏడాది గులాబీ జెండా ఆవిర్భావ వేడుకలకు మలేషియాలోని కౌలాలంపూర్ వేదిక కానున్నది. ఈ మేరకు జూన్ 6న (నేడు) జరగనున్న ఉత్సవాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ మలేషియా శాఖ, మలేషియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పల్లె నుంచి పట్టణాల అభివృద్ధితోపాటు తెలంగాణలో ఐటీ అభివృద్ధికి కేటీఆర్ చేసిన కృషి, ప్రణాళికలు యావత్తు ప్రపంచంలోని తెలంగాణ ప్రజలు కీర్తిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి కథలో అనేక అధ్యాయాలు నమోదైనా, ప్రపంచ దృష్టిని అత్యంత వేగంగా ఆకర్షించిన అధ్యాయం నవకల్పనలది. ఒకప్పుడు ఐటీ రంగంలో అవకాశాల కోసం ఇతర ప్రాంతాలను ఆశ్రయించిన యువత, నేడు తమ ఆలోచనలతో ప్రపంచ స్థాయి సంస్థలను సృష్టించే స్థాయికి చేరుకోవడం వెనుక దూరదృష్టి, కార్యాచరణ, నిరంతర ప్రయత్నం దాగి ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో, ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ కేవలం పెట్టుబడులను ఆహ్వానించిన రాష్ట్రంగా కాకుండా, ఆలోచనలకు చిరునామాగా, స్టార్టప్‌లకు నిలయంగా, యువత కలలకు వేదికగా రూపాంతరం చెందింది. టీ-హబ్ వంటి సంస్థల ద్వారా నవకల్పనలకు బలమైన పునాది వేయడం, ప్రపంచ సాంకేతిక రంగ దృష్టిని హైదరాబాద్ వైపు మళ్లించడం, స్థానిక ప్రతిభను అంతర్జాతీయ అవకాశాలతో అనుసంధానం చేయడం ద్వారా తెలంగాణకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావడంలో కేటీఆర్ పోషించిన పాత్ర విశేషమైనది. అందుకే నేడు తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు భవనాల ఎత్తు కంటే ఆలోచనల ఎత్తు, పెట్టుబడుల పరిమాణం కంటే అవకాశాల విస్తృతి, ప్రభుత్వ కార్యక్రమాల కంటే యువతలో నింపిన ఆత్మవిశ్వాసమే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమాచార సాంకేతిక రంగాన్ని కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం చేయకుండా, భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ వంటి వేదికల స్థాపన ద్వారా యువతలోని సృజనాత్మకతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించారు.
స్టార్టప్ సంస్కృతిని గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాలనే సంకల్పంతో ప్రతిభను పెట్టుబడులతో, పరిశోధనను పరిశ్రమలతో, విద్యను ఉపాధితో అనుసంధానించే విధానాలు అమలులోకి తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక సంస్థలను హైదరాబాద్ వైపు ఆకర్షించడంతోపాటు, స్థానిక యువతను ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా తీర్చిదిద్దారు. ఫలితంగా దేశంలోని అగ్రశ్రేణి ఐటీ కేంద్రాల్లో ఒకటిగా ఎదగడమే హైదరాబాద్ కాకుండా, నవకల్పనలకు చిరునామాగా అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నది. తెలంగాణలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన నాయకత్వం గురించి చర్చ వచ్చినప్పుడు, ఆ మార్పును కార్యరూపంలో చూపించిన కేటీఆర్ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఆ మార్పుల వెనుక విధానాలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి, వాటిని కార్యరూపంలోకి తీసుకువచ్చిన నాయకత్వం కూడా ఉన్నది. ఆ నాయకత్వంలో కేటీఆర్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే.
కేటీఆర్ తరచుగా యువతతో మమేకమవుతూ ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాకుండా ఉద్యోగాలను సృష్టించే దిశగా ఆలోచించాలని ఆయన చెప్పిన సందేశం ఇస్తారు. కేటీఆర్ పిలుపు ఎంతోమందిని ప్రభావితం చేసింది. ఆ ఆలోచనే స్టార్టప్ సంస్కృతికి బలమైన పునాది అయింది. ఒక చిన్న ఆలోచన కూడా ప్రపంచ మార్కెట్‌ను చేరగలదనే నమ్మకం యువతలో పెరిగింది. ఫలితంగా తెలంగాణ నుంచి పుట్టిన అనేక సంస్థలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్నాయి. తెలంగాణలో ఐటీ రంగం విస్తరణ కూడా ఈ ప్రయాణంలో ఒక ముఖ్య ఘట్టం. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ కార్యాలయాలను విస్తరించేందుకు హైదరాబాద్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న కారణాల్లో మౌలిక సదుపాయాలు, అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధానమైనవి. ఈ అంశాలను సమన్వయం చేయడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. పెట్టుబడిదారులతో నిరంతర సంభాషణలు, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ అవకాశాలను పరిచయం చేయడం, పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచారు.
అభివృద్ధి అనేది నగరాలకే పరిమితం కాకూడదనే భావన కూడా తెలంగాణ విధానాల్లో కనిపిస్తుంది. జిల్లాలకు సాంకేతిక అవకాశాలను విస్తరించడం, గ్రామీణ యువతకు కొత్త అవకాశాల ద్వారాలు తెరవడం, విద్యా సంస్థలను ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దడం వంటి ప్రయత్నాలు జరిగాయి. దీని వల్ల ప్రతిభ కేవలం మహానగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లోనూ వికసించే పరిస్థితులు ఏర్పడ్డాయి. నేటి ప్రపంచంలో దేశాలు, రాష్ర్టాలు పరస్పరం పోటీపడుతున్నాయి. పెట్టుబడులు, సాంకేతికత, మానవ వనరులను ఆకర్షించేందుకు ప్రతీ ప్రాంతం తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించగలిగింది. దీనికి కారణం కేవలం భౌగోళిక ప్రయోజనం కాదు; భవిష్యత్తు అవసరాలను ముందుగానే అర్థం చేసుకుని తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల అమలులో కేటీఆర్ చూపిన చొరవ తెలంగాణకు విశిష్ట స్థానాన్ని తీసుకువచ్చింది.
ఒక రాష్ర్టానికి నిజమైన సంపద భూములు కాదు, భవనాలు కాదు, ఖనిజాలు కాదు. ఆ రాష్ట్ర యువత మేధస్సు, వారి సృజనాత్మకత, వారి కలలు. ఆ కలలకు దిశ చూపగలిగితే చరిత్ర సృష్టించవచ్చు. తెలంగాణ కథ ఆ విషయాన్ని నిరూపించింది. నవకల్పనలకు విలువ ఇచ్చిన నేలగా, యువతకు అవకాశాలు కల్పించిన వేదికగా, భవిష్యత్తును ఆహ్వానించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుంది. ఆ ప్రయాణంలో కేటీఆర్ పాత్ర విశిష్టమైనది. తెలంగాణ ఆధునిక అభివృద్ధి గాథలో కేటీఆర్ మార్క్ విశేషమైనది. ఆ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటుతూ నేటి నుంచి మలేషియాలోని వివిధ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్తూ.. యువతను భాగస్వాములు చేసే సందేశం ఇవ్వనున్నారు.