వైరా టౌన్, ఆగస్టు 17 : పెద్దలమాటను నిజం చేస్తూ రాష్ట్రంలోని రైతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజులుగా చేస్తే.. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే కర్షకులతో కాళ్లు మొక్కించుకుంటోంది. సమస్త రైతు సంక్షేమ పథకాలు తెచ్చి, వాటిని సమగ్రంగా అమలుచేసి అన్నదాతల ఆత్మగౌరవాన్ని ఆసాంతం పెంచింది గత ప్రభుత్వం. కానీ, అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం అదే అన్నదాతలను అరిగోస పెడుతోంది.
కాళ్లపై పడినా ఒక్కోసారి కనికరించని కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన యాప్ ద్వారా ఎరువులు ఎలా తీసుకోవాలని తెలియని ఓ వృద్ధ రైతు ఇటీవల మెదక్ జిల్లా రంగంపేట వ్యవసాయ సహకార సంఘం అధికారి కాళ్లపై పడిన దయనీయ దృశ్యాన్ని మరువకముందే.. తన పొలానికి సాగు నీరు ఇవ్వాలంటూ ఖమ్మం జిల్లా వైరాలో మరో వృద్ధ రైతు సాక్షాత్తూ ఎస్ఐ కాళ్లపై పడిన హృదయవిదారక ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు వైరాలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం ధర్నా నిర్వహించారు. రైతులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకొని ధర్నాలో కూర్చున్నారు. అదే సమయంలో కార్యాలయానికి వస్తున్న డీఈ నాగబ్రహ్మయ్య వద్దకు వెళ్లిన రైతులు.. పంటలను బతికించుకునేందుకు సాగునీరు అందించాలంటూ కోరారు. అందుకు ఆయన స్పందిస్తూ.. సాగునీరు విడుదల చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి తమకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలూ లేవని ఆయన బదులిచ్చారు.
దీంతో రైతులు ఆయనపై ఆగ్రహించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వైరా ఎస్సై పుప్పాల రామారావు.. రైతులను సముదాయించారు. ఉన్నతాధికారులతో డీఈ ఫోన్లో మాట్లాడుతారంటూ ఆయనను కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులతో డీఈ ఫోన్లో మాట్లాడినా.. ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే చేయొద్దని ఉన్నతాధికారులు చెప్పారు. డీఈ సూచన మేరకు ఇదే విషయాన్ని ఎస్ఐ రామారావు బయటకు వచ్చి ధర్నా చేస్తున్న రైతులతో చెప్పారు.

దీంతో మరింత ఆగ్రహించిన రైతులు ధర్నాను కొనసాగించారు. ఇంతలో తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన రైతు బోడేపూడి మాధవరావు అనే వృద్ధ రైతు ధర్నాలోంచి లేచివచ్చి ఎస్ఐ కాళ్లమీద పడ్డారు. దీంతో రైతులకు దుఖ్ఖాన్ని మిగుల్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, నాయకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ కాళ్లమీద పడిన రైతు మాధవరావు అతడితో తన గోడువెళ్లబోసుకున్నారు. వైరా మండలం లింగన్నపాలెంలో తాను ఐదు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నానని, ఇప్పటికే ఎకరాకు రూ.15 వేల చొప్పున ఖర్చు చేశానని, ఇప్పుడు సాగునీరు విడుదల చేయకపోతే తన పంట చనిపోతుందని, అలా జరిగే తనకు కూడా చావే శరణ్యమని కంటతడి పెట్టుకున్నారు.
ఈ దృశ్యం తోటి రైతులను, నాయకులను కలిచివేసింది. దీంతో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో డీఈ మరోసారి ఫోన్లో మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. నీటి విడుదలకు వారు అంగీకరించడంతో వెంటనే ఎస్ఐ సమక్షంలో రైతులు, అఖిలపక్ష నాయకులతో డీఈ మాట్లాడారు. తక్షణమే నీటిని విడుదల చేస్తామని చెప్పారు. అక్కడి నుంచే సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో వారు వైరా రిజర్వాయర్ కుడి కాలువ గేటును నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.