నకిరేకల్, సెప్టెంబర్ 22 : రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనపై దృష్టి పెట్టాల్సిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రవల్లిలోని కేసీఆర్, సిద్దిపేటలోని హరీశ్‌రావు, జన్వాడలోని కేటీఆర్ వ్యవసాయ క్షేత్రాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు.. మాఫియాను నడిపించే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు లేదని పేర్కొన్నారు. హరీశ్‌రావుపై బీర్ల విమర్శలు చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని చెప్పారు.
కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఆలేరులో పారించడంలో హరీశ్‌రావు ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. ప్రతిపక్షానికి కొరకరాని కొయ్యగా హరీశ్‌రావు మారడంతో ఆయన టార్గెట్‌గా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అభివృద్ధి చేసిన యాదగిరిగుట్ట ఆలయాన్ని అడ్డుగా పెట్టుకుని వందల ఎకరాల్లో వెంచర్లువేసి అమాయకులను మోసం చేసిన చరిత్ర అయిలయ్యదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు సాగు, తాగునీరు, కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. జూరాల నిండినా సాగునీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికీ బుద్ధి చెబుతామని హెచ్చరించారు.