హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): కుమ్మెర ఘటనను కవులు తీవ్రంగా ఖండించారు. ‘పశువులు సిగ్గుపడేలా కాళ్లతో తన్ని పసికూనతోపాటు రాజ్యాంగాన్ని ఖననం చేశారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్మెర బాధితులను బహుజన ఉద్యమ కవి జూలూరు గౌరీశంకర్, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య, రచయిత రమేశ్‌బాబు, కవి, సామాజిక ఉద్యమకారుడు ఎదిరెపల్లి కాశన్న, తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వహీద్‌ఖాన్, అరసం రాష్ట్ర నాయకులు కల్వకోల్ మద్దిలేటి, పార్థసారథి, క్రాంతి తదితరులు బుధవారం పరామర్శించారు.
బాధితులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. రెండునెలల బిడ్డను కోల్పోయిన బాధితురాలు మౌనికను ఓదార్చారు. ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చ అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కన్నీటిపర్యంతమయ్యారు.