KTR | హైదరాబాద్ : రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు భవనం ఆధునికంగా కడుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయంలో కాకుండా మరో చోట కట్టాలని కోరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ భూముల్లో హైకోర్టు భవనం నిర్మించొద్దని యూనివర్సిటీ విద్యార్థులు నెల రోజుల పాటు ఆందోళన చేశారు. వ్యవసాయ విద్యాలయంలో పరిశోధనలతో ఫీల్డ్ ఎక్సపరిమెంట్ పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధనలకు భూమి అవసరం. రాష్ట్ర రైతంగానికి ఉపయోగపడే విధంగా కొత్త వంగడాలు తీసుకురావాలి. కాబట్టి వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన యూనివర్సీటి భూములను తీసుకోవద్దని కోరుతున్నా. అగ్రికల్చర్ వర్సిటీకి చెందిన 100 ఎకరాలు తీసుకుంటామన్న ఆలోచన విరమించుకోవాలి. అక్కడ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్ర చట్టాల విషయంలో కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు సీఎంలు ముగ్గురు కూడా తమ తమ రాష్ట్రాల్లో సవరణలు తీసుకోస్తామన్నారు. ఈ చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం కూడా నేరం. గతంలో మీ పార్టీ వారు చాలా సార్లు చేశారు. కాబట్టి ఇబ్బందులు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రతిపక్షాలు నిరసనలు చేయడం పరిపాటి. కాబట్టి మీరు సవరణలు తీసుకోస్తారో లేదో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పౌర హక్కుల సంఘం వారు సభ పెట్టుకుంటామంటే పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఏ చట్టం ఉపయోగించి నిరాకరించరో తెలియడం లేదు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే డిలీట్ చేయమని ఒత్తిళ్లు వస్తున్నాయి. అనధికారిక ఒత్తిడి, బలప్రయోగం చేయడం సరికాదు. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. చట్టాలను దుర్వినియోగం చేసే పరిస్థితి రాకూడదన్నారు కేటీఆర్.
ఇవి కూడా చదవండి..
KTR | ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే : ఎమ్మెల్యే కేటీఆర్
Congress | అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. అసెంబ్లీలో పరిణామాలపై కాంగ్రెస్లో అంతర్మథనం!