KTR | హైదరాబాద్ : న్యాయ వ్యవస్థపైన ప్రజలందరికీ ఒక అపారమైన నమ్మకం, విశ్వాసం ఉంది.. కానీ ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే.. అంత అన్యాయం జరిగినట్లే అని బీఆర్ఎస్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థిస్తూ, స్వాగతిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతలు న్యాయ వ్యవస్థకు రాజ్యాంగంలోనే బలమైన పునాదులు వేశారు. రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలి. అత్యాచారాలు, సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలి. దీంతో మిగతా వారెవ్వరూ కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో కొత్త చట్టాలు వస్తున్నాయి. ఈ మధ్యనే కేంద్రం కొత్త న్యాయ చట్టాలు తెచ్చింది. ఈ చట్టాల వల్ల మనకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా..? అని సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో వామపక్ష ఉద్యమాలు, ప్రజా సంఘాలు క్రియాశీలంగా ఉన్నాయి. గతంలో ఎంతో మంది ఉద్యమాలు చేసి అసువులు భాసారు. కొత్త చట్టాల వల్ల తెలంగాణ పోలీసు రాజ్యంగా మారుతుందా అనే సందేహం ఉంది. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను కర్ణాటకలో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో కొంత మార్పులు చేర్పులు చేసి పోలీసు రాజ్యం కాకుండా పౌరసమాజానికి కొన్ని హక్కులు ఉండేలా సవరణలు చేశారు. ఈ చట్టాల విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య కూడా కేంద్ర చట్టాలపై నిరసన తెలిపారు. సవరణలు తీసుకోస్తామని చెప్పారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కొత్త చట్టాల విషయంలో సవరణలు చేయాలి. పోలీసు రాష్ట్రం, రాజ్యంగా మారకుండా చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ సూచించారు.
సైబర్ క్రైమ్తో చాలా మంది బాధితులు లక్షల రూపాయాలు కోల్పోతున్నారు. ఈ కేసుల్లో సత్వర న్యాయం లభించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో నియామకాలు పూర్తి చేయాలి. ఎంత ఆలస్యంగా న్యాయం జరిగితే అంత అన్యాయం జరిగినట్లే. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియా మీద కూడా కొన్ని బిల్లులు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియాలో పౌరులు తమ వాక్ స్వాతంత్ర్యాన్ని వ్యక్తీకరించేలా ఉండాలి. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా చట్టాలు వస్తున్నాయి. కేంద్రం తీసుకొస్తున్న కొన్ని చట్టాల వల్ల పోలీసు రాజ్యం వచ్చే ప్రమాదం ఉందని కొన్ని సవరణలు తీసుకొస్తామని కర్ణాటక ప్రభుత్వం తెలిపిందని కేటీఆర్ తెలిపారు.
మేం ఎలాంటి వీడియోలు తీయలేదు. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఏ రకంగా జరిగిందో విచారించి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ప్రధాని నుంచి సీఎంలు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, స్పీకర్ల మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి ఎవరు అతీతులు కాదు. నెహ్రూ పాలన నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. అందరం బాధితులమే అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Congress | అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. అసెంబ్లీలో పరిణామాలపై కాంగ్రెస్లో అంతర్మథనం!