Congress | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గత కొన్ని రోజులుగా సాఫీగా సాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఒక్కసారిగా గాడి తప్పడానికి కారణం ఏమిటనే అంశంపై కాంగ్రెస్‌లో వేడివేడి చర్చ జరుగుతున్నది. రాష్ట్ర బడ్జెట్, రైతు రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ అంశాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాల్సిన సమయంలో బీఆర్ఎస్ నిరసనలు, ఆందోళనలకు ప్రాధాన్యం పెరగడం ప్రభుత్వ పెద్దలకు, పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో మహిళా ప్రజాప్రతినిధులను అవమానించామనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది నెలలుగా నిరుద్యోగ యువత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసుకొని… ముచ్చర్లలో వర్సిటీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం వల్ల యువతలో కొంతమేర నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని ప్రభుత్వం, పార్టీ భావిస్తున్నది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ప్రణాళికను కూడా రూపొందించుకున్నారు. అయితే, బుధవారం మధ్యాహ్నం వరకు అనుకున్నట్టుగానే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కొనసాగిందనీ, కానీ ఒక్కసారిగా చోటుచేసుకున్న పరిణామాలతో ప్రణాళిక దెబ్బతిన్నదని, అనుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి? అని వాపోతున్నారు.
ఎదురుదాడి చేశారా? ఆజ్యం పోశారా?
ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తయిన దశలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో ఒక్కసారిగా దుమారానికి దారి తీశాయి. సీఎం వ్యాఖ్యలు పరిస్థితిని ‘చే’జార్చిందని పలువురు కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. సీఎం వ్యాఖ్యల తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు వెను వెంటనే నష్టనివారణ చర్యలకు దిగినప్పటికీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ఉన్నాయనే చర్చ జరుగుతున్నది. భట్టి తన అనుభవంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారనే నమ్మకం సీఎంలో ఉన్నదని, కానీ తాను సభకు తిరిగి వచ్చేసరికి దుమారం మరింత పెద్దది కావడంతో రేవంత్‌రెడ్డి కూడా అంతర్మథనంలో పడిపోయారని సదరు నేతలు చెప్పుకుంటున్నారు. బుధవారం సీఎం వ్యాఖ్యల తర్వాత డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు మినహా మిగిలిన మంత్రులెవరూ మాట్లాడకపోవటం కాంగ్రెస్ నేతల చర్చల్లో ప్రధానాంశంగా మారింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి కీలక, సీనియర్ నేతలు కూడా ఆ అంశంలో సీఎంకు అండగా నిలబడి మాట్లాడలేదని, కేవలం మంత్రి సీతక్క మాత్రమే మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ప్రణాళికకు భిన్నంగా ప్రచారం
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వపరంగా చేసుకోవాల్సిన ప్రచారం జరగకపోగా… అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధులను అవమానపరిచామనే అపవాదు మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని పలువురు కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు.మరోవైపు పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు బదులుగా అధికార కాంగ్రెస్ పార్టీయే రాద్ధాంతం చేయటం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నదని భావిస్తున్నారు. కొన్నిరోజుల కిందటి వరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి వలసలు ఉంటాయని చెప్తూ వస్తున్న పార్టీ పెద్దలు… అనుకున్నది జరగడంలేదనే అసహనాన్ని పరోక్షంగా అసెంబ్లీలో ప్రదర్శించినట్టయిందని సూత్రీకరిస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి దశలో ప్రభుత్వ వాయిస్ ప్రజల్లోకి వెళ్లకపోగా, స్కిల్ వర్సిటీ శంకుస్థాపనపై ప్రజల్లో చర్చ జరగలేదని, అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధులకు అవమానం, ఆ మేరకు బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలు, ఆందోళనలే పత్రికల్లోనూ ప్రధానాంశాలుగా మారాయని సదరు నేతలు నిట్టూరుస్తున్నారు.