Sriya Reddy | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న హీరోగా అభిమానులు గుర్తుపడతారు. ముఖ్యంగా నాన్ చాక్‌తో ఆయన చేసే ఫైట్లు సినిమాల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. కెరీర్ ప్రారంభం నుంచే తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్‌ను తెరపై చూపిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా ఖుషి వంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు అభిమానులను ఎంతగానో అలరించాయి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నటి శ్రీయా రెడ్డి తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు చూసిన అభిమానులు ఆమెను ‘ఫీమేల్ ఓజీ’ అంటూ ప్రశంసిస్తున్నారు.
శ్రీయా రెడ్డి ఒక పాత్రను ఎంచుకుంటే దానికోసం పూర్తిగా అంకితభావంతో పనిచేయడం ఆమె ప్రత్యేకత. కేవలం నటనకే పరిమితం కాకుండా అత్యంత కఠినమైన యోధ విద్య కలరిపయట్టును కూడా ఆమె అభ్యసిస్తున్నారు. ఈ విద్యలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటైన ఉరిమిను గిరగిరా తిప్పుతూ ఆమె ఇస్తున్న ప్రదర్శనలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె స్పీడ్, ఫోకస్ చూస్తుంటే యుద్ధరంగంలోకి దిగిన యోధురాలిలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సినిమా షూటింగ్ సమయంలో శ్రీయా రెడ్డి చూపించిన అంకితభావం పవన్ కళ్యాణ్‌ను కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆమె నటనను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరోసారి కలిసి నటించాలని ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా సహనటుల గురించి పవన్ కళ్యాణ్ ఇలా బహిరంగంగా ప్రశంసించడం చాలా అరుదుగా జరుగుతుందని అభిమానులు చెబుతున్నారు.
శ్రీయా రెడ్డి సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా పొగరు సినిమాలో ఆమె పోషించిన నెగెటివ్ షేడ్ పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. అలాగే కంచివరం వంటి చిత్రాల్లోనూ ఆమె తన నటనతో ఆకట్టుకున్నారు. ఇటీవల ఓటీటీలో సంచలనం సృష్టించిన సుఝల్ వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటన వైవిధ్యం స్పష్టంగా కనిపించింది. టాలీవుడ్లో ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాల్లో సలార్ పార్ట్ 1 ఒకటి. ఇందులో రాధా రమగా కనిపించిన ఆమె పవర్ఫుల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న సలార్ 2: శౌర్యాంగ పర్వంలో కూడా ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో శ్రీయా రెడ్డి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.