Sree Vishnu | తెలుగు సినీ పరిశ్రమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకునే హీరోలలో శ్రీ విష్ణు ఒకరు. విభిన్నమైన కథలు, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీవిష్ణు, తర్వాత చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీలో తన స్థానం సంపాదించుకున్నారు. తన కెరీర్లో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా, సామజవరగమన వంటి సినిమాలు కీలక మలుపుగా నిలిచాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ చిత్రం భారీ విజయాన్ని సాధించి శ్రీవిష్ణును కంటెంట్ స్టార్‌గా నిలబెట్టింది. కామెడీ, ఎమోషన్ కలిసిన పాత్రల్లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది.
అదే విధంగా ఓం భీం బుష్ మరియు సింగిల్ సినిమాలతో కూడా శ్రీవిష్ణు మంచి విజయాలను అందుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘సింగిల్’ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఆయన కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే నారి నారి నడుమ మురారి చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి ఆ సినిమాకు కూడా తన వంతు సహకారం అందించారు. అయితే తాజాగా శ్రీవిష్ణు కెరీర్లో వరుసగా రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఆయన నటించిన విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ చిత్రాలు వారం వ్యవధిలోనే విడుదలయ్యాయి. ఫిబ్రవరి చివరి వారంలో విడుదలైన ‘విష్ణు విన్యాసం’ సినిమాలో వాస్తు, లక్కీ నంబర్లను నమ్మే యువకుడిగా శ్రీవిష్ణు కనిపించారు. కామెడీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాలేదు.
ఆ సినిమా ప్రభావం తగ్గకముందే మరో చిత్రం ‘మృత్యుంజయ్’ విడుదలైంది. ఈ సినిమాపై మేకర్స్ మంచి నమ్మకం పెట్టుకున్నప్పటికీ సాధారణ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. విడుదలకు ఒక రోజు ముందు మీడియాకు ప్రదర్శించినప్పుడు కొంతమంది ప్రశంసించినా, ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా థియేటర్ కంటే ఓటీటీకి సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీకెండ్లో కొంతవరకు కలెక్షన్లు వచ్చినప్పటికీ ఆదివారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైల్ మ్యాచ్ కారణంగా కలెక్షన్లు తీవ్రంగా పడిపోయాయి. సోమవారం నుంచి కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదు. దీంతో ఈ రెండు సినిమాలు శ్రీవిష్ణుకు బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదల కావడం ఆయనకు బ్యాడ్‌లక్‌గా మారిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు తక్కువ వ్యవధిలో విడుదలైతే ప్రేక్షకుల్లో గందరగోళం ఏర్పడే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.