హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన (Congress) ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మనసు మార్చుకుని సొంతగూటికి వెళ్లకుండా చేసేందుకు ఆపసోపాలు పడుతున్నది. ఘర్ వాపసీలో భాగంగా బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని (MLA Krishna Mohan Reddy) నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో గురువారం మంత్రి జూపల్లి కృష్ణరావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే సంతృప్తి చెందలేదో ఏమో.. తాజాగా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలిపించుకున్నారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే చేరుకున్నారు. సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు.
కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడలేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించిన విషయం తెలిసిందే. రెండ్రోజుల కిందట అసెంబ్లీ కారిడార్‌లో బండ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనిపిస్తే పాత పరిచయం కొద్ది వారితో మాట్లాడినట్టు పేర్కొన్నారు. అందరం కాంగ్రెస్‌లోనే ఉన్నామని పేర్కొన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి అల్పాహారం చేశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీలో ఎవరి గౌరవం వారికి ఉంటుందని అన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి ఎమ్మెల్యేను కలిసినట్టు చెప్పారు.
మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాత్రం గద్వాల ఎమ్మెల్యే బండ్ల తమ పార్టీలోనే ఉన్నారని చెబుతుంటే పక్కనే ఉన్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాత్రం నోరు మెదపకపోవడం కొసమెరుపు. పార్టీలో ఉన్నారా? లేదా? అని మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేను ప్రశ్నించగా.. మౌనం వహించారు.