రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం 2025వ సంవత్సరానికి గాను ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కథనం విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం విలేకరులతో ముచ్చటించారు.
రివార్డులతోపాటు అవార్డులు కూడా దక్కడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ‘భగవంత్ కేసరి’కి గత ఏడాది నేషనల్ అవార్డుతోపాటు గద్దర్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు వెంటనే ‘సంక్రాంతికి వస్తున్నాం’కి కూడా అవార్డ్ దక్కడంతో దర్శకుడిగా నా బాధ్యత మరింత పెరిగినైట్టెంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. వినోదాత్మక చిత్రమే అయినా.. కాస్తంత డిఫరెంట్‌గా ట్రై చేశాను. ‘భగవంత్ కేసరి’ లాంటి సీరియస్ డ్రామా తర్వాత చేసిన ఈ కామెడీ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని క్రియేట్ చేసింది.
ప్రతి విజయం ఎనర్జీని పెంచుతుంది. అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. అలాగే భయం కూడా ఉంటుంది. అది లేకపోతే నిజాయితీగా సినిమా చేయలేం. వెంకటేశ్‌తో నేను చేసిన సినిమాలన్నీ విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేస్తున్నా. ఇది కొంచెం కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. అందుకే సమయం కూడా కాస్త ఎక్కువే తీసుకుంటున్నా. ఇప్పటివరకూ వచ్చిన నా సినిమాలన్నింటికంటే ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్‌తో చేస్తున్నా. ఇది చాలా ఇంట్రస్టింగ్ కొలాబరేషన్. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి, నవంబర్‌లో పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్ చేస్తాం.