Harish Rao | హైదరాబాద్ : పాలకపక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా.. సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు, సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. సభా నాయకుడు ఇతర సభ్యులకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ప్రాంగణంలో హరీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పుదోవ పట్టించారు. నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్లపై కూడా తప్పుడు పత్రంతో సీఎం సభను తప్పుదోవ పట్టించారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారు. ఈ అంశంపై మేము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చాము. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తాం. నేను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింపజేశారు అని హరీశ్‌రావు తెలిపారు.
పోతిరెడ్డిపాడుపై వైఎస్ హాయాంలో మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నాం అని రేవంత్ మాపై ఆరోపణలు చేశారు. పోతిరెడ్డిపాడుపై జీవో రాకముందే మేము వైఎస్ కేబినెట్ నుంచి వైదొలిగాము. మేము రాజీనామా చేయడానికి పోతిరెడ్డి పాడు సహా అనేక అంశాలు కారణం. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారు..? కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ఆర్ఎస్ ఫీజులు లేకుండా చేయాలని ఆనాడు డిమాండ్ చేశారు.. ఇప్పుడేం చేస్తున్నారు.. అన్నీ ద్వంద్వ ప్రమాణాలే. రేవంత్ ఇప్పటికే మూడు సార్లు అబద్దపు అంశాలతో సభను తప్పుదోవ పట్టించారు. మీడియా కూడా రేవంత్ అబద్దాలను ఎండగట్టాలి. రుణమాఫీపై రేవంత్‌ది గోబెల్స్ ప్రచారం. రూ. 31 వేల కోట్లు రుణమాఫీకి అవుతుందని చెప్పి చివరకు రూ. 25 వేల కోట్లే బడ్జెట్లో పెట్టారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Crop Loans | రేపు రెండో విడుత రుణమాఫీ ప్రారంభం.. ఈ సారైనా అర్హులందరికీ మాఫీ అయ్యేనా..?