పారిస్: పశ్చిమాసియా సమరంలోకి ఫ్రాన్స్ కూడా అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు .. విచక్షణరహితంగా ఇరాన్ తన ఆయుధాలను వాడుతున్నది. ఈ నేపథ్యంలో యురోపియన్ దేశమైన ఫ్రాన్స్ తన ఆస్తులను కాపాడుకునేందుకు ముందుకు కదులుతోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్ మంగళవారం కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన యుద్ధ నౌకను మధ్యధరా ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. బాల్టిక్ సముద్రం నుంచి మెడిటెరేనియన్ దిశగా యుద్ధనౌక చార్లెస్ డీ గల్లే దూసుకెళ్తున్నది. ఆ యుద్ధ నౌకకు ఎస్కార్ట్‌గా వాయుసేన, ఫ్రిగేట్స్ కూడా ఉండనున్నాయి. రఫేల్ యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్‌బార్న్ రేడర్ వ్యవస్థలను ఇప్పటికే పశ్చిమాసియాలో ఫ్రాన్స్ మోహరించినట్లు తెలుస్తోంది.
బ్రిట్టనీ పట్టణంలోని బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్ బేస్ నుంచి మాక్రన్ ప్రసంగించారు. దేశానికి చెందిన కీలక ఆస్తులను కాపాడుకునేందుకు తాము వెనుకడుగు వేయబోమన్నారు. యురోప్ మిత్ర దేశాలతో కలిసి ముందుకు సాగనున్నట్లు చెప్పారు. దేశ కీలక ప్రయోజనాలకు ఆటంకం ఎదురైతే సహించేదిలేదన్నారు. అమ్ములపొదిలో న్యూక్లియర్ వార్‌హెడ్స్ సంఖ్యను పెంచుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.తమ వద్ద ఎంత సంఖ్యలో న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నాయో చెప్పబోమన్నారు.
ఫ్రాన్స్ వద్ద సుమారు 290 న్యూక్లియర్ వార్‌హెడ్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఈ అంచనా వేశారు. బ్రిటన్, జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, గ్రీస్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు కూడా అణు నిరాయుధీకరణ ఆకాంక్షిస్తున్నట్లు మాక్రన్ తెలిపారు. యురోపియన్ యూనియన్ దేశాల్లో ఒక్క ఫ్రాన్స్ దగ్గరే అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ వెపన్స్ 9 దేశాల వద్ద ఉన్నాయి. రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూకే, చైనా, ఇండియా, పాకిస్థాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా ఆ జాబితాలో ఉన్నాయి. అయితే అణ్వాయుధ ఒప్పందం ప్రకారం మాత్రం మొదటి 5 దేశాలనే న్యూక్లియర్ వెపన్ స్టేట్స్‌గా గుర్తిస్తున్నారు.