AP News | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. అతి వేగంగా వచ్చిన ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. మృతులను కర్ణాటక వాసులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.